రంగస్థలం సినిమాలో గోదావరి యాసలో రామ్ చరణ్ మాట్లాడి అందరి మనసులను గెలుచుకున్నారు. భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా రాయలసీమ యాసలో మాట్లాడి మెప్పించనున్నారు. జై లవకుశ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 20 కిలోల బరువు తగ్గి అట్లెటిక్ బాడీని సొంతం చేసుకున్నారు. ఈ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ లుక్ తోనే మొదట నగర శివార్లలో ఓ భారీ యాక్షన్ సీన్ ని పూర్తి చేశారు. త్వరలో రామోజీ ఫిలిం సిటీలో నాలుగు కోట్లతో నిర్మితమమైన రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన సెట్ లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అందుకోసం తారక్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
అది కూడా పక్కా రాయలసీమ యాసలో మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ పట్టు పడితే ఆ పాత్ర అలా దిగిపోతుంది. సో ఇందులోనూ రాయలసీమ యువకుడిగా ఆ ప్రాంత ప్రజల గుండెలో స్థానం పదిలం చేసుకోబోతున్నారు. అలాగే ఆ యాసలో ఒక ఫోక్ సాంగ్ కూడ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల విడుదలైన ‘కృష్ణార్జున యుద్ధం’లో ‘దారి చూడు దుమ్ము చూడు’ పాట పాడిన పెంచల్ దాస్ ఈ పాటని ఆలపించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది.