యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాపై నిర్ణయం తీసుకున్నారు. జనతా గ్యారేజ్ రిలీజ్ నుంచి కథలను వినడంలో నిమగ్నమైన తారక్ వారం క్రితం ఒక కథను సెలక్ట్ చేశారు. డైలాగ్ రైటర్ గా అనేక విజయంతమైన సినిమాలకు పని చేసి డైరక్టర్ గా టర్న్ అయిన అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీకి ఎన్టీఆర్ ఫ్లాట్ అయినట్టు తెలిసింది. ఇతను తీసిన పటాస్, సుప్రీమ్ సినిమాలు మంచి హిట్ సాధించాయి. యాక్షన్, కామెడీని రెండింటిని సమ పాళ్లలో మిక్స్ చేసే ట్యాలెంట్ అతని సొంతం. అందుకే ఎన్టీఆర్ కి అనిల్ పై మంచి అభిప్రాయం ఉంది.
కథ కొత్తగా ఉండడంతో అతన్నే తన తర్వాతి సినిమా డైరక్టర్ గా ఎంపిక చేశారు. ఇందులో ఎన్టీఆర్ అంధుడిగా నటించనున్నట్లు సమాచారం. ఈ కథను అనిల్ మొదట ఎనర్జిటిక్ హీరో రామ్ కి వినిపించారు. అతను చేయడానికి అంగీకారం కూడా తెలిపాడు. మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ చేతిలో పడింది. ఆయనకి ఈ కథ బాగా నచ్చడంతో, వారం నుంచి మైనర్ చేంజెస్ చేయడంలో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నారు. తారక్ రేంజ్, ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగినట్లుగా కొన్ని సీన్లు కొత్తగా రాస్తున్నట్లు టాక్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా పూర్తి వివరాలను వచ్చే వారంలో అధికారికంగా వెల్లడించనున్నారు.