నాన్నగారు చనిపోయిన తర్వాత పెనివిటి సాంగ్ లో నటించడం ఎప్పటికీ మరువలేను! : ఎన్టీఆర్

అరవింద సమేత ట్రైలర్ లో “వందడుగుల్లో నీరు పడుతుందంటే నీరు పడుతుందంటే.. 99 అడుగులు వరకు తవ్వి ఆపేసేవాడ్ని ఏమంటారు? మీ విజ్ణతకే వదిలేస్తున్నాను.. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్.. తవ్వి చూడండి..” అని ఎన్టీయార్ చెప్పిన డైలాగ్ సినిమాలోని పాత్ర నైజాన్ని వ్యక్తపరచడమే కాదు.. నిజజీవితంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను డిఫైన్ చేస్తుంది. పుట్టినప్పట్నుంచే పోరాటం చేస్తూ పెరిగిన నటుడు ఎన్టీయార్. తొలుత ఉనికి కోసం, అనంతరం పేరు కోసం, తర్వాత స్టార్ డమ్ కోసం, అనంతరం కుటుంబం కోసం, ఇప్పుడు అభిమానులకి ఒక అద్బుతమైన చిత్రాన్ని అందించడం కోసం.

ఇలా ఎన్టీఆర్ అహరహం శ్రమిస్తూనే ఉన్నాడు. ఆ కష్టాన్ని చూసే “అదృష్టలక్ష్మి” కొంతకాలంగా ఎన్టీఆర్ చెంత తిష్ట వేసుకొని కూర్చుండిపోయింది. ఇక మొన్న ఎన్టీయార్ కుటుంబంలో చోటు చేసుకొన్న విషాదాన్ని గరళాన్ని తాగిన శివుడిలా పంటి బిగువున అదిమిపెట్టి ముందుకుసాగిన ఎన్టీయార్ గుండె నిబ్బరాన్ని చూసి “ధైర్యలక్ష్మి” కూడా అతని వద్దకు వలస వెళ్లిపోయింది. ఇలా తనవద్ద ఎందరు లక్ష్మీలు ఉన్నా.. తాను మాత్రం ఎప్పటికీ “లక్ష్మీ ప్రణతి సమేత తారకరామారావు”ని మాత్రమేనని చెబుతున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్. ఆయన నటించిన తాజా చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ” అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించాడు జూనియర్ ఎన్టీఆర్.

మగాడి చేతిలో ఉండాల్సిన అతి పెద్ద ఆయుధం ఆడది..
“అరవింద సమేత వీర రాఘవ” ఇంత పొడుగు టైటిల్ ను సినిమాకి పెట్టడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. సినిమాలో కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ముఖ్యంగా.. సినిమా మొత్తం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం చుట్టూ తిరుగుతుంటుంది. ఇప్పుడంటే పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. దేవుళ్ళను సైతం “సీత సమేత రాములవారు” అని పిలిచేవారు. ఎవరైనా పెళ్ళికి పిలిచినా కూడా సతీ సమేతంగా లేదా కుటుంబ సమేతంగా రండి ఆనేవారు. మనిషి జీవితంలో ఒక స్త్రీ తోడు చాలా అవసరం అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. మగాడి చేతిలో ఉండాల్సిన అతి పెద్ద ఆయుధం ఆడది.. అనేది సినిమా థీమ్. అందుకే.. త్రివిక్రమ్ గారు టైటిల్ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఫైనల్ చేసేశామ్.

హిట్టు సినిమా తీయాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు..
త్రివిక్రమ్ అనే కాదు నేను ఏ దర్శకుడితోనూ “హిట్ సినిమా తీయాలి” అని ఫిక్స్ అయ్యి సినిమా మొదలెట్టలేదు. సినిమా అనేది ఒక జర్నీ. త్రివిక్రమ్ తో నాకున్న 13 ఏళ్ల పరిచయం ఈ సినిమాతో మరింత బలపడింది. అలా ఒక ఎమోషనల్ జర్నీగా ఈ సినిమా మొదలైంది కానీ.. కంపల్సరీ హిట్ కొట్టాలన్న ప్రెజర్ మాత్రం ఎప్పుడు లేదు.

యుద్ధం చేసే సత్తా లేనోడికి.. శాంతి అడిగే హక్కు లేదు..
సినిమాలో వయెలెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే.. చీకటి గురించి తెలిస్తేనే వెలుగు యొక్క ప్రాముఖ్యత, అవసరం బోధపడినట్లుగా.. కాస్తంత వయొలెన్స్ చూపిస్తేనే, వయొలెన్స్ అనేది ఎందుకు వద్దు అనేది చెప్పగలం. అందుకే మా సినిమాలో యాక్షన్, వయొలెన్స్ ఉంటుంది.. కానీ.. అదే సమయంలో అవి ఎందుకు వద్దో కూడా చెబుతుంది. ఈ సినిమాలో వయొలెన్స్ ట్రైలర్ లో కనిపించినంత ఎక్కువ ఉండదు. సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది.. “అరవింద సమేత” ఎంత అద్భుతమైన సినిమా అనేది.

డైరెక్టర్-హీరో భార్యాభర్తల్లాంటివాళ్లు..
నా దృష్టిలో డైరెక్టర్ అనే వ్యక్తి భర్త అయితే.. హీరో అనే వ్యక్తి భార్యతో సమానం. ఒక కథానాయకుడికి మొదటి విశ్లేషకుడు-ప్రేక్షకుడు దర్శకుడే. అలాగే.. ఒక హీరో తన నటనతో సంతృప్తిపరచాల్సింది కూడా దర్శకుడినే. ఈ ఇద్దరిదీ ఒక అద్భుతమైన బంధం. ఈ ప్రొసెస్ నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ తో జరిగింది. కాకపోతే.. నాకు, త్రివిక్రమ్ మధ్య 13 ఏళ్ల నుంచి పరిచయం ఉంది కాబట్టి.. ఈ సినిమాతో అది మరింత బలపడింది.

ఒక ఫ్లాప్ బట్టి ఎలా డిసైడ్ చేస్తాం..
“అజ్ణాతవాసి” తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో “హిట్ కొట్టాలి” అనే ప్రెజర్ ఫీల్ అయిన మాట వాస్తవమే. కానీ.. అదే ధ్యేయంగా మాత్రం ఎప్పుడు వర్క్ చేయలేదు. ఒక మంచి సినిమా తీద్దామనే అనుకొన్నామ్. అయినా.. ఒక్క ఫ్లాప్ బట్టి మనిషిని అంచనా వేయడం, అతని స్టామినాని డిసైడ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అలా అనుకుంటే నాకూ చాలా ఫ్లాపులున్నాయి. సో, మా ప్రెజర్ ను మేము పాజిటివ్ వే లోనే తీసుకొన్నాం తప్పితే నెగిటివ్ గా మాత్రం ఎప్పుడూ తీసుకోలేదు.

మనది చాలా క్షణికమైన జీవితం..
నాన్నగారి మరణం నన్ను చాలా బాధపెట్టింది, ఇబ్బందిపెట్టింది. కానీ.. జీవితం అంటేనే బ్రతకడం. లోలోపల ఎంత బాధపడుతున్నా బయటకి మాత్రం గంభీరంగా ఉంటున్నాను. ఎందుకంటే.. నా తల్లి, భార్య, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది. ఈ నెలరోజుల్లో నాకు అర్ధమైన విషయం ఏంటంటే.. మనం చాలా క్షణికమైన జీవితం బ్రతుకుతున్నాం.

ఆ “ఇంకేదో” అనేది ఏంటి నాకూ అర్ధం కావడం లేదు..
నా ప్రతి సినిమా విడుదలైనప్పుడు అభిమానులు, విశ్లేషకులు అనేది ఏమిటంటే.. “ఇది ఎన్టీఆర్ రేంజ్ సినిమా కాదు, ఎన్టీయార్ నుంచి ఇంకేదో రావాలి” అంటుంటారు. ఆ ఇంకేదో ఏంటీ అనేది నాకు ఇప్పటికీ తెలియలేదు. నేను ఫలానా సినిమా చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జైలవకుశ లాంటి సినిమాలు అలా వచ్చాయి, నేను చేశాను.

పాట సినిమాలో భాగం అవ్వాలి కానీ..
ఈ సినిమాలో డ్యాన్స్ నెంబర్స్ లేవు అని నా అభిమానులు కొందరు బాధపడుతున్నారు అని తెలిసిందే. అయితే.. నేను ముందు నటుడ్ని, ఆ తర్వాత డ్యాన్సర్ ని. డ్యాన్స్ అనేది నా నటనలో భాగం. అయినా.. ఇంతకుముందు పాట అనేది కథనంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పాట కోసమే సందర్భాలను క్రియేట్ చేశాం. అందరం దాన్ని ఫాలో అయ్యామ్. కానీ.. మళ్ళీ ఎక్కడో థాట్ వచ్చింది. పాటని ఒక ఐటెమ్ లా ఇరికించడం కరెక్ట్ కాదేమోనని. అందుకే “అరవింద సమేత”లో మీకు స్పెషల్ గా డ్యాన్స్ కోసం పాటలు కనిపించవు.

అసలు “టిపికల్ ఎన్టీఆర్ ఫిలిమ్” అంటే ఏంటి..
కేవలం కొందరు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అవే తరహా సినిమాలు చేస్తూ కూర్చోలేమ్ కదా. ఒక సినిమా హిట్ అయినప్పుడు “ఇది టిపికల్ ఎన్టీయార్ ఫిలిమ్ లా లేదు” అంటారు, అలాగే.. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు “ఇది ఎన్టీయార్ టిపికల్ సినిమా” అంటారు. అసలు టిపికల్ ఎన్టీఆర్ సినిమా అంటే ఏంటి అనేది నాకు అర్ధమయ్యేది కాదు. కానీ.. సినిమా అనేది అందరూ ఎంజాయ్ చేయాల్సిన ఒక మీడియం. సో, నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తాను తప్పితే “టిపికల్ ఎన్టీయార్ ఫిలిమ్స్” మాత్రం చేయను.

పెనివిటి సాంగ్ చేస్తున్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది..
పెనివిటి సాంగ్ వినడం ఎప్పుడో జరిగినప్పటికీ.. ఆ పాట షూటింగ్ మాత్రం నాన్నగారు చనిపోయిన తర్వాత చేశాను. అందువల్ల ఆ పాట షూటింగ్ జరుగుతున్నంతసేపు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా ఇంట్లో విషాదం జరిగింది కాబట్టి నేను ఆ సాంగ్ కి కనెక్ట్ అయ్యాము కానీ.. ప్రతి ప్రేక్షకుడు, మనిషి ఈ పాటకు కనెక్ట్ అవుతారు.

కథ విన్నప్పుడే వ్యక్తిగతంగా మారాను..
“అరవింద సమేత” కథను త్రివిక్రమ్ నేరేట్ చేసినప్పుడే ఒక వ్యక్తిగా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా నాలో చాలా మార్పులు వచ్చాయి. బెటర్ హజ్బెండ్ అయ్యాను, మంచి కొడుకుగా, తండ్రిగా కూడా మారాను. అన్నిటికీ మించి ఒక మంచి నటుడిగా నన్ను ఈ చిత్రం తీర్చిదిద్దింది. ఈ సినిమాలో నా పాత్ర నన్ను ఎంత ఇన్ఫ్ల్యుయెన్స్ చేసిందో.. ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ప్రభావితం చేస్తుంది. అయితే.. ప్రేక్షకుల్లో మార్పు వస్తుందో రాదో చెప్పలేను కానీ.. తప్పకుండా ఒక ఆలోచన మాత్రం వస్తుంది.

వేయింగ్ మెషీన్ చూసి షాక్ అయ్యాను..
“జైలవకుశ” సినిమా తర్వాత నేను చాలా లావైపోయాను. ఒకరోజు వేయింగ్ మెషీన్ లో నా వెయిట్ నేను చూసుకొని షాక్ అయిపోయాను. 88.5 కేజీలు ఉన్నాను ఆ సమయానికి. కానీ.. “అరవింద సమేత” సినిమాకి నేను చాలా ఫిట్ గా ఉండాలని త్రివిక్రమ్ చెప్పారు. అందుకే.. లాయిడ్ అనే ట్రైనర్ సారధ్యంలో ఇమ్మీడియట్ గా వర్కౌట్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలా ఉన్నాను. నేను వర్కవుట్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది నా వైఫ్.

త్రివిక్రమ్ మాట్లాడుతూ ఉంటే.. నేను వింటూ ఉంటా
నేనేమో పుస్తకాలు పెద్దగా చదవను, కానీ.. త్రివిక్రమ్ మాత్రం పుస్తకాలను విపరీతంగా చదువుతుంటారు. అయితే.. నాకు ఆయన ఫలానా పుస్తకం చదువు అని ఎప్పూడూ చెప్పలేదు కానీ.. ఏదైనా పుస్తకం గురించి కానీ.. ఆ పుస్తకంలోని సారాంశం గురించి కానీ.. త్రివిక్రమ్ అనర్గళంగా చెబుతూ ఉంటే.. నేను అనర్గళంగా వింటూ ఉంటాను (నవ్వుతూ..).

నా గోల్స్ మారుతూ ఉన్నాయి..
చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్లాలన్నది గోల్, టెన్త్ క్లాస్ లో ఎలాగైనా పాస్ అయిపోవాలి అనేది గోల్, సినిమాల్లోకి వచ్చాక సినిమా హిట్ అవ్వాలి అనేది గోల్, ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి.. మళ్ళీ ఒక్క సక్సెస్ కావాలి అనేది గోల్ గా పెట్టుకొన్నా. ఇలా నా జీవితంలో నా గోల్స్ అనేవి మారుతూ వచ్చాయి. ప్రస్తుతం నా గోల్ ఏంటంటే నా పిల్లలు.

నాకు ఆ ఆలోచన లేదు..
ఈమధ్య నెట్ ఫ్లిక్స్ & అమేజాన్ లో వచ్చే వెబ్ సిరీస్ ను చూస్తున్నాను. అయితే.. అందులో నటించాలన్న ఆలోచన మాత్రం ఇప్పటివరకూ రాలేదు. బేసిగ్గా.. నేను ఆ ఇంటర్నెట్ సినిమా ప్రపంచానికి సింక్ అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా మంచి కాన్సెప్ట్ తో నా దగ్గరకి వచ్చి.. ఆ కాన్సెప్ట్ కి వైడ్ రీచ్ వస్తుంది అనుకుంటే చేస్తానేమో కానీ.. ఇప్పటివరకూ నాకు ఆలోచన మాత్రం లేదు.

రాజమౌళి సినిమా తర్వాత ఏమిటనేది నాకు తెలియదు..
ప్రతి పెద్ద హీరోకి కనీసం అయిదారు సినిమాలు పైప్ లైన్ లో ఉండాలి అని అంటుంటారు కానీ.. నేను అది నమ్మను. ఎందుకంటే.. ప్రతి సినిమాతో సమీకరణలు (ఈక్వేషన్స్) దారుణంగా మారిపోతుంటాయి. అందుకే.. ఒకేసారి అయిదారు సినిమాలు ఒప్పేసుకోవడం అనేది నేను ఎప్పుడూ చేయను. నా తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుంది. ఆ తర్వాత దత్తుగారి నిర్మాణంలో ఒక సినిమా ఉంటుంది. అంతే తప్ప అట్లీ దర్శకత్వంలో సినిమా ఇంకా ఫైనల్ అవ్వలేదు.

“మహేష్ – చరణ్ – ఎన్టీఆర్” కాంబినేషన్ సినిమా చేయాలని నాకూ ఉంది..
రాజమౌళి డైరెక్షన్ లో చరణ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో రెండు సామాజిక వర్గాల మధ్య సంబంధాలు ఏర్పడతాయి, లేదా ఫ్యాన్స్ కలుస్తారు అనేదానికంటే.. ఒక కొత్త ఒరవడికి తెరలేపుతున్నాం అనేది ఆనందం ఎక్కువగా ఉంది నాకు. అలాగే.. “మహేష్ – చరణ్ – ఎన్టీఆర్” అనే కాంబినేషన్ కూడా తెరపై వస్తే బాగుండు అనే ఆశ కూడా ఉంది. మేం ముగ్గురం రెడీగా ఉన్నాం. ఒక మంచి కెప్టెన్ & స్టోరీ దొరికితే గనుక ముగ్గురం కలిసి నటించడానికి రెడీ ఉంటాం.

పెంచల్ దాస్ చాలా హెల్ప్ చేశారు..
ఈ సినిమాలో హీరో రాయలసీమ యాస మాట్లాడాలి అనేది త్రివిక్రమ్ ఆలోచన. కానీ.. ఆయన యాస, మాండలీకం విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు. అందుకే పెంచల్ దాస్ గార్ని సహాయం అడిగామ్. ఆయన చాలా హెల్ప్ చేశారు. నా డ్రైవర్ ది రాయలసీమ వాడు అంతకుముందు రాయలసీమ యాసలో మాట్లాడుతుంటే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించేది. కానీ.. నేను ఇప్పుడు సీమ యాసలో మాట్లాడుతుంటే.. వాడు ఆనందపడడం చూసి నాకు సంతోషమనిపిస్తుంది.

నా ఇద్దరు కొడుకుల వల్ల బిగ్ బాస్ ను మిస్ అవ్వలేదు..
బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత సెకండ్ సీజన్ కి కూడా అడిగారు కానీ.. నేను అప్పటికే సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాను. అలాగే పర్సనల్ లైఫ్ లోనూ నా ఇద్దరు కొడుకులతో చాలా బిజీ అయిపోయాను. అందువల్ల బిగ్ బాస్ ను పెద్దగా మిస్ అవ్వలేదు. అసలు సెకండ్ సీజన్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఫాలో అవ్వలేదు. అసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ “పక్కోడి జీవితంలో తొంగి చూడడం” అనేది అందరికీ మహా సరదా. ఇక మూడో సీజన్ కి హోస్టింగ్ చేయడం అనేదాని గురించి నేను ఇప్పటివరకూ ఆలోచించలేదు.

దసరా స్పెషల్ సెంటిమెంట్స్ లాంటివి లేవు..
సెంటిమెంట్ పరంగా చూసుకుంటే “అరవింద సమేత” తప్పకుండా హిట్ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అలా అనుకుంటే “యమ దొంగ” ఆగస్ట్ లో విడుదలైంది. అదే ఆగస్ట్ లో విడుదలైన “రభస” పోయింది. సో, ఇక్కడ సెంటిమెంట్ ఎక్కడ వర్కవుట్ అయ్యింది చెప్పండి. అందుకే.. సెంటిమెంట్స్ అనేవి పట్టించుకోవడం లేదు.

రాజమౌళి సినిమా గురించి ఆయనే చెప్పాలి..
మేము ఆ సినిమాకి సంబంధించి అప్డేట్స్ మీతో చెప్పకూడదు అని రూల్ ఏమీ లేదు కానీ.. రాజమౌళిగారి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఆయన చెబితేనే బాగుంటుంది. అందుకే మేం కూడా వెయిట్ చేస్తున్నాం. “ఆర్.ఆర్.ఆర్” అనేది టైటిల్ మాత్రం కాదు. తప్పకుండా ఒక మంచి టైటిల్ పెడతాం.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus