“అన్నయ్య బ్యానర్ లో సినిమా అంటే నాతో మొదలుకొని మా తల్లిదండ్రులు, నా భార్యాబిడ్డలు, నా అభిమానులు.. ఇలా అందరూ సంతోషపడేలా ఉండాలన్న ఆశయంతోనే “జై లవకుశ” సినిమా కోసం ఎక్కువ కేర్ కంటే ఎక్కువ ప్రెజర్ తీసుకొని వర్క్ చేశాను, సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ రిజల్ట్స్ ని పక్కన పెట్టేస్తే.. నేను పడిన శ్రమ చూసి అందరూ “తారక్ బాగా కష్టపడ్డాడు” అనుకోవాలి కానీ.. నవ్వుకోకూడడు” అంటూ “జై లవకుశ” సినిమా విడుదల సందర్భంగా తాను తొలిసారి త్రిపాత్రాభినయం పోషించడం మొదలుకొని సినిమా రిజల్ట్ ను తాను ఏవిధంగా తీసుకొంటాడు, జై, లవ, కుశ పాత్రలను పోషించడానికి ఎలాంటి రిఫరెన్సులు తీసుకొన్నాడు, తన భవిష్యత్ చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి.. ఇలా చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు చాలా సరదాగా, హుందాగా చెప్పాడు మన జూనియర్ ఎన్టీయార్, ఆ సరదా సంభాషణ మీకోసం..!!
వంద సినిమాల్లో యాక్ట్ చేసినట్లనిపించింది..
“జై లవ కుశ”లో మూడు పాత్రలు పోషించడానికి కష్టపడిన మాట వాస్తవమే కానీ.. ది బెస్ట్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ ఈ చిత్రం. ఓ వంద సినిమాల్లో నటించినట్లనిపించింది. ఒక్కో పాత్ర తీరు వేరు, శైలి వేరు, మాట్లాడే విధానం వేరు. అందుకే “జై లవ కుశ” నా కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్ అని నిర్మొహమాటంగా చెప్పగలను.
లవ, కుశ పాత్రలకు ఉన్న సౌలభ్యం జై పాత్రకు లేదు..
సినిమాలోని రెండు పాత్రలు “లవ & కుశ” క్యారెక్టర్స్ ప్లే చేయడానికి నాకు రిఫరెన్సులు ఉన్నాయి. లవుడి పాత్ర “నాన్నకు ప్రేమతో” సినిమాలోని అభిరామ్ పాత్రను పోలి ఉంటే.. కుశుడి పాత్రకు “యమదొంగ” సినిమాలోని రాజా క్యారెక్టర్ రిఫరెన్స్ గా పనికొచ్చింది. అయితే.. “జై” క్యారెక్టర్ ను బాబీ డిజైన్ చేసిన విధానం చాలా పెక్యులర్ గా ఉంటుంది.. అందువల్ల ఆ క్యారెక్టర్ ను ఎలా ప్లే చేస్తే ఆడియన్స్ కు రీచ్ అవుతుందో అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉండేది.
చాలా వేరియేషన్స్ ఉండాలి..
జై పాత్రధారి రావణుడి ఉపాసకుడు. అంటే ఆల్మోస్ట్ రావణుడి స్థాయి వ్యక్తి. అతనిలానే పౌరుషం, వెటకారం, ఈగో, కోపం, భయమెరుగకపోవడం వంటి స్వభావం కలిగి ఉండాలి. వీటన్నిటికీ మించి మా డైరెక్టర్ బాబీ “నత్తి” కూడా యాడ్ చేశాడు. అలా నత్తిగా డైలాగులు పలుకుతున్నప్పుడు ఆడియన్స్ నవ్వారంటే క్యారెక్టర్ ఫెయిల్ అయినట్లే.. క్యారెక్టర్ ఫెయిల్ అయ్యిందంటే, ఒక నటుడిగా నేనూ ఫెయిల్ అయినట్లే. అందుకే చాలా జాగ్రత్తగా నత్తిగా పలికే మాటలు ఇంకా పవర్ ఫుల్ గా ఉండడం కోసం బొంగురు గొంతుతో డబ్బింగ్ చెప్పాను.
కేర్ కంటే ప్రెజర్ ఎక్కువ..
“జై లవ కుశ”లో ట్రిపుల్ రోల్ అనుకొన్నప్పట్నుంచి.. నా ధ్యేయం ఒక్కటే. సినిమా కోసం నేను పడిన కష్టాన్ని చూసి ఎవరూ నవ్వుకోవడం లేదా తీసిపారేసినట్లుగా మాట్లాడకూడదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా “బాగా కష్టపడ్డార్రా” అనుకోవాలి. అందుకే సినిమాలోని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యాను.
ప్రొడ్యూసర్ అనే మాటే రాలేదు..
సొంత బ్యానర్ కావడం, అందరూ ఒక మంచి సినిమా తీయాలన్న ఒకే ఒక్క ధ్యేయంతో పని చేయడం వల్ల.. కళ్యాణ్ రామ్ అన్నయ్య ప్రొడ్యూసర్, నేను హీరో అనే భావన నాలో కానీ సెట్లో కానీ ఎవరికీ ఉండేది కాదు. కొన్ని విషయాల్లో నేను డెసిషన్ తీసుకుంటే.. ఇంకొన్ని విషయాల్లో అన్నయ్య తీసుకొనేవాడు. ఒక కలెక్టివ్ డెసిషన్ ప్రకారమే సినిమా ముందుకెళ్లింది కానీ.. ఏ ఒక్కరి వలనో కాదు.
క్యారెక్టర్స్ కంటే ఎమోషన్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యాను..
బేసిక్ గా నేను చాలా ఎమోషనల్ పర్సన్ అండి. అందువల్ల… బాబీ నాకు కథ చెబుతున్నప్పుడు ట్రిపుల్ రోల్, భారీతనం వంటి విషయాల కంటే సినిమాలోని ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయ్యాను. అందుకే “జనతా గ్యారేజ్” తర్వాత బోలెడన్ని కథలు విన్నప్పటికీ.. “జై లవకుశ”కి బాగా కనెక్ట్ అయ్యాను.
సీనియర్ ఎన్టీయార్ గారి ఇంపాక్ట్ నాపై పడకూడదు అనుకున్నాను..
జై పాత్ర రావణుడి జీవనశైలికి చాలా దగ్గరగా ఉండడంతో.. తాతయ్యగారు రావణుడిగా నటించిన సినిమాలు ఏమైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా అని కొందరు అడిగారు. చిన్నప్పట్నుంచి నేను ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాను.. ఇప్పుడు ప్రత్యేకంగా చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది లేదు. నాకెప్పుడూ ఆయనే ఇన్స్పిరేషన్. అయితే.. జై పాత్ర పోషణలో ఆయన్ని ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ ఇమిటేట్ చేయడం లేదా రావణుడిగా ఆయన వ్యవహారశైలి నాపై ఇంపాక్ట్ చూపకూడదు అని మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొన్నాను.
నాకూ అలాంటి సినిమాలు చేయాలనుంది కానీ..
తాతయ్యగారి తరహాలో నాకూ పౌరాణిక చిత్రాల్లో నటించాలని, తాతయ్యగారి స్థాయిలో కాకపోయినా రావణుడిగా, కర్ణుడిగా, కృష్ణుడిగా, రాముడిగా పౌరాణిక పాత్రలు వెండితెరపై అద్భుతంగా పోషించాలన్న ఆలోచన నాకూ ఉంది. కానీ.. అంత పెద్ద స్కోప్ ఉన్న సినిమాలను హ్యాండిల్ చేసే డైరెక్టర్స్ ఉండాలి కదా. అలాంటి డైరెక్టర్ దొరికినప్పుడు తప్పకుండా పౌరాణిక సినిమా చేస్తాను.
కుదరాలే కానీ నెగిటివ్ క్యారెక్టర్ కి కూడా నేను రెడీ..
ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషించాలన్నది నా కల. అది నెగిటివా, పాజిటివా అనే బేధం నాకు లేదు. ఒకవేళ “జై” లాంటి అద్భుతమైన విలన్ రోల్ నాకొచ్చిందంటే.. ఏమాత్రం సంకోచించకుండా విలన్ రోల్ ప్లే చేయమన్నా నేను రెడీ.
అది రాజమౌళి ఇష్టం..
రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా ఎప్పుడు అని అందరూ అడుగుతూనే ఉంటారు. అయితే.. అది నా చేతిలో లేదు, ఎప్పుడైతే రాజమౌళి ఒక కథ సిద్ధం చేసుకొని “ఐయామ్ రెడీ తారక్” అంటాడో అప్పుడు నేను రెడీ.
నెగిటివ్ కామెంట్ చేసే ప్రతివాడూ నా అభిమాని కాదు..
ఈమధ్య ట్విట్టర్, ఫేస్ బుక్ లో హీరో ఫ్యాన్స్ వార్స్ చూస్తూనే ఉన్నాం. అయితే.. నా ఫోటో పెట్టుకొని ఇతర హీరోల మీదనో లేక వారి అభిమానుల మీదనో కామెంట్ చేసేవాడు నా అభిమాని అన్న నమ్మకం ఏముంది. వాడు ఫేక్ క్యాండిడేట్ అయ్యి కూడా ఉండవచ్చు కదా. ఎవరు ఒరిజినల్ ఫ్యాన్ అనేది కనుక్కోవాలంటే ఫేస్ బుక్ & ట్విట్టర్ ఫలానా ఎకౌంట్ హోల్డర్ ఫలానా హీరో ఫ్యాన్ అని సర్టిఫికేషన్ స్టార్ట్ చేయాలి (నవ్వుతూ..). అయితే.. సోషల్ మీడియా అనేది ఒక కంబైన్డ్ ప్యాకేజ్.. మంచి-చెడు, పాజిటివ్-నెగిటివ్ అనేవి సమపాళ్లలో ఉంటాయి. నేను వాటిని పెద్దగా పట్టించుకోను. కేవలం నా అభిమానులకు అందుబాటులో ఉండాలన్న ఏకైక కారణంతో నేను సోషల్ మీడియాలో ఉన్నానే తప్ప.. ఈ విషయాలన్నిట్నీ పెద్దగా పట్టించుకోను.
– Dheeraj Babu