వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తన 170వ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చేయనున్నారు. ఈ మేరకు లైకా అధినేత సుభాస్కరన్ పుట్టిన రోజు సంద్భంగా సినిమా అనౌన్స్ అయ్యింది. ‘జై భీమ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమాను కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాను అనౌన్స్ చేయడమే కాదు.. వచ్చే ఏడాది విడుదల చేస్తామంటూ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఇక రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న ‘లాల్ సలాం’ సినిమాలోనూ రజనీ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆ తర్వాత ఇప్పుడు జ్ఞానవేల్ సినిమా ఉంటుంది. ఇక జ్ఞానవేల్ గురించి చూసుకుంటే మూడో సినిమాకే రజనీకాంత్‌తో పని చేసే ఛాన్స్ కొట్టేశారు. అన్నట్లు రజనీకంత్ కూడా ఇటీవల తరచుగా కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తూ వస్తున్నారు.
కథ నచ్చితే చాలు సీనియారిటీ చూడని హీరోల్లో రజనీ ఒకరు అని మరోసారి నిరూపించారు. జ్ఞానవేల్ మొదటి సినిమా 2017లో వచ్చిన ‘కూటత్తిల్ ఒరుతన్’. ఆ తర్వాత సూర్యతో ‘జై భీమ్’ చేశారు. ఇప్పుడు రజనీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా కొత్తగా వచ్చిన దర్శకుడు అనే విషయం తెలిసిందే. మరోవైపు లైకా సంస్థ రజనీకాంత్‌తో ‘రోబో 2.O’, ‘దర్బార్’ వంటి సినిమాలు చేసింది.
అయితే సమాజంలో బర్నింగ్ టాపిక్‌గా ఉన్న అంశాన్ని పట్టుకుని ‘జై భీమ్’ కథ రాసుకున్నారు జ్ఞానవేల్. మరిప్పుడు రజనీకాంత్ కోసం ఇంకేం పాయింట్ పట్టుకుని లాగబోతున్నారో అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన కథ, ఆలోచనలు రజనీ రూపంలో బయటకు వస్తే మామూలుగా ఉండదు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.