పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న OG (OG Movie) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. చిత్ర బృందం ప్రియాంక మోహన్ (Priyanka Mohan) పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే పూర్తిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi) , పవన్ కళ్యాణ్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉంది.
ఇక మరోవైపు OG (OG Movie) థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడవుతున్నాయి. పవన్ గత సినిమాల రికార్డులను మించి ఈ సినిమా బిజినెస్ సాగుతుండటం విశేషం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రైట్స్ రూ. 70 కోట్ల రేంజ్‌లో ముగిసినట్లు టాక్. నైజాం ఏరియాలో సినిమా రైట్స్ రూ. 46 కోట్లకు పలికాయని సమాచారం. ముఖ్యంగా కన్నడ థియేట్రికల్ రైట్స్ విషయంలో మేకర్స్ ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు.
కర్ణాటకలో ఈ సినిమా హక్కులు JPR ఫిలిమ్స్ అనే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. హోల్‌సేల్ డీల్‌గా రూ. 12 కోట్లకు జీఎస్టీ అదనంగా చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇది కన్నడలో పవన్ సినిమాలకు సంబంధించిన అత్యంత భారీ డీల్ అని చెప్పొచ్చు. మేకర్స్ వచ్చే ఏడాది సమ్మర్‌కి సినిమా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పవన్ వారసుడు అకీరా నందన్ కూడా ఈ సినిమా మ్యూజిక్ కోసం వర్క్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇది నిజమైతే, థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ జరిపే సంబరాలు మరొక రేంజ్‌లో ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.