భర్తతో కలిసి “మజిలీ”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత సమంత నటించగా విడుదలైన తాజా చిత్రం “ఓ బేబీ”. కొరియన్ ఫిలిమ్ “మిస్ గ్రానీ”కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే 8 భాషల్లో రీమేక్ అవ్వడం విశేషం. మరి బేబీగా సమంత తన నటవిశ్వరూపం ఏమేరకు ప్రదర్శించిందో చూద్దాం..!!
కథ: బేబక్క అలియాస్ సావిత్రి (లక్ష్మీ) 70 ఏళ్ల ముసలావిడ. కొడుకు లెక్చరర్ గా పని చేస్తున్న కాలేజ్ లోనే క్యాంటీన్ నడుపుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే బేబీ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోలేక ఆమెను ఒక విలన్ గా భావిస్తుంటారు ఆమె కోడలు, మనవరాలు. ఒకానొక సందర్భంలో ఆమెను ఇంటి నుంచి వెళ్లిపోమని కూడా కసురుకొంటారు.
ఆ బాధతో ఇంటి నుండి వెళ్ళిపోయిన బేబీ ఊహించని విధంగా 24 ఏళ్ల అమ్మాయి (సమంత)గా మారిపోతుంది. తాను వయసులో ఉన్నప్పుడు పొందలేకపోయిన ఆనందాలన్నీ ఆస్వాదించాలనుకోంటుంది.
ఈ క్రమంలో బేబీ తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయమవుతుంది. ఆమెకు కూడా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇలా ఒకే జన్మలో రెండు బ్రతుకుల ప్రయాణం ఎలా సాగింది? చివరికి ఏ తీరానికి చేరింది? అనేది “ఓ బేబీ” కథ.
నటీనటుల పనితీరు: సమంత ఒక హీరోయిన్ మాత్రమే కాదు మంచి నటి అని ఇప్పటికే ప్రూవ్ చేసుకొన్నప్పటికీ.. ఈ సినిమాతో నటి మాత్రమే కాదు ఒక మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకొంది ఈ సినిమాతో. 70 ఏళ్ల భామ తరహాలో బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేస్తే.. ఆ తరహాలోనే హావభావాలతో పాత్రకు ప్రాణం పోసింది సమంత. కొన్ని సన్నివేశాల్లో కాస్త అతి చేస్తుంది అనిపించినా.. ఓవరాల్ గా ఆకట్టుకొంది.
“మహానటి” అనంతరం రాజేంద్రప్రసాద్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొన్న సినిమా ఇదే. చంటి పాత్రలో ఎమోషన్స్ ను ఏ స్థాయిలో పండించాడో కామెడీ కూడా అదే స్థాయిలో చేసి తన సీనియారిటీ మరోసారి ప్రూవ్ చేసుకొన్నాడు.
మురారి సినిమా చూసినప్పుడు “అమ్మ” అంటే ఇలానే ఉండాలి అనిపించేలా చేసిన లక్ష్మీ.. “ఓ బేబీ” సినిమాలో మన బామ్మ కూడా ఇలానే ఉంటే ఎంత బాగుండు లేదా మన బామ్మ కూడా ఇలానే ఉంటుంది కదా అని అందరూ అనుకొనే రీతిలో చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచింది.
నాగశౌర్య కేవలం నందిని రెడ్డి కోసమే ఈ చిత్రం చేసినట్లుగా ఉన్నాడు. రావు రమేష్ ఎప్పట్లానే హావభావాలతో, సంభాషణలతో కంటతడి పెట్టించాడు. తేజ సజ్జ, సునైన అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: సౌండ్ డిజైనింగ్ & కెమెరా వర్క్ సినిమాకి మైనస్ అయ్యాయి. రిచర్డ్ ప్రసాద్ లాంటి టెక్నీషియన్ నుంచి ఈస్థాయి యావరేజ్ సినిమాటోగ్రఫీ వర్క్ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. ఇక సౌండ్ డిజైనింగ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది. సింగిల్ స్క్రీన్ లో చూస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. డాల్బీ అట్మాస్ లో ఈ సినిమా చూస్తే మాత్రం సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అనేది దెబ్బతినడం ఖాయం. ప్రొడక్షన్ వేల్యుస్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా.. షూటింగ్ లోకేషన్స్ చాలా రీపీటెడ్ గా ఉండడం, ఆర్ట్ వర్క్ సోసోగా ఉండడం గమనార్హం. ఇక మిక్కీ జె.మేయర్ అందించిన పాటల్లో “చాంగు భళా, ఓ బేబీ” పాటలు తప్పితే మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పాటకి, బ్యాగ్రౌండ్ కి ఏ యాంగిల్ లోనూ సింక్ అవ్వలేదు.
నందిని రెడ్డి కొరియన్ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు-చేర్పులు చేసిన విధానం బాగుంది. అయితే.. కథనం మరీ సాగదీతలా మారింది. 160 నిమిషాల సినిమాలో అంత కథ కనిపించలేదు.
అలాగే.. సన్నివేశాల అల్లిక (స్క్రీన్ ప్లే) కూడా ఎమోషనల్ గా కానీ, క్యాజువల్ గా కానీ కనెక్ట్ అయ్యేలా కనిపించలేదు. ఏదో ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి అందర్నీ వాడేసినట్లుగా ఉంటుంది తప్పితే.. సన్నివేశానికి తగ్గ ప్రాధాన్యత ఉన్న పాత్ర కనిపించదు. ఒక పాట పాడాలంటే సందర్భంతోపాటు కథ-కథనం ఉండాలి అని సంభాషణల్లో చాలా స్పష్టంగా రాయించుకొన్న నందిని రెడ్డి.. ఒక సన్నివేశానికి కూడా అదే సందర్భం కథనం ఉండాలనే విషయాన్ని చాలా చోట్ల విస్మరించించింది. అలాగని ఆమెది బ్యాడ్ వర్క్ అని కాదు.. ఆమెకు ఇంకాస్త టైమ్ ఇచ్చి, ఇంకాస్త రిచ్ ప్రొడక్షన్ & పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇచ్చి ఉంటే సినిమా ఇంకాస్త బాగా వచ్చేది.
విశ్లేషణ: సమంత పెర్ఫార్మెన్స్, లక్ష్మీ స్క్రీన్ ప్రెజన్స్, రాజేంద్రప్రసాద్ పరిణితి, రచయిత లక్ష్మీ భూపాల పదునైన సంభాషణలు, అక్కడక్కడా వచ్చిన కామెడీ సన్నివేశాల కోసం “ఓ బేబీ” చిత్రాన్ని ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చు.