హీరోగా కొంత విరామం అనంతరం “ఒక పథకం ప్రకారం” అంటూ ప్రేక్షకుల్ని పలకరించాడు సాయిరాం శంకర్. మలయాళ దర్శకుడు వినోద్ విజయన్ తెలుగులో తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయి కొన్నేళ్లు అవుతున్నప్పటికీ.. ఎట్టకేలకు ఇవాళ (ఫిబ్రవరి 07) విడుదలైంది. థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ్ నీలకంఠ (సాయిరాం శంకర్) తన భార్య సీత (ఆషిమా నార్వల్) కనిపించకుండాపోవడంతో తాగుడు, డ్రగ్స్ కి బానిసై.. కోర్టులో తోటి లాయర్ చినబాబు మీద చేయి చేసుకోవడంతో సస్పెండ్ అయ్యి.. ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్న తరుణంలో.. జ్వాల (భానుశ్రీ) హత్య కేసులో ఇరికించబడతాడు.
వైజాగ్ లో జరుగుతున్న వరుస మర్డర్స్ లో సిద్ధార్థ్ నీలకంఠ పలుమార్లు నేరస్థుడిగా గుర్తించబడతాడు. తనను ఎవరో ఈ హత్యల్లో ఇరికిస్తున్నాడు అని గ్రహించిన సిద్ధార్థ్.. పోలీస్ ఆఫీసర్ కవిత (శృతి సోధి)తో కలిసి వరుస హత్యలను ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. అసలు ఈ హత్యలు చేస్తున్నది ఎవరు? సిద్ధార్థ్ ను ఎందుకు ఇరికించాలి అనుకుంటారు? ఈ కేసును సిద్ధార్థ్ ఎలా ఛేదించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఒక పథకం ప్రకారం” చిత్రం.
నటీనటుల పనితీరు: సాయిరాం శంకర్ ఒక సీరియస్ పాత్రలో మెప్పించాడు. ఒక మంచి లభిస్తే తనను తాను ప్రూవ్ చేసుకోగల సత్తా ఉందని కాస్త గట్టిగానే నిరూపించుకున్నాడు. లుక్స్ విషయంలోనూ భిన్నమైన షేడ్స్ లో అలరించాడు. దివంగత కళాభవన్ మణి ఇన్నాళ్ల తర్వాత ఒక సినిమాలో కనిపించడం కాస్త సంతోషకరమైన విషయమే అయినప్పటికీ.. ఆయన డబ్బింగ్ సరిగా సెట్ అవ్వలేదు. అయితే.. చిన్నపాటి హాస్యం మాత్రం పండింది.
సముద్రఖని పాత్రకు కూడా డబ్బింగ్ బాగోకపోయినా.. కామెడీ పంచులు మాత్రం ఆకట్టుకున్నాయి. సహాయ పాత్రల్లో శృతి సోది, ఆషిమా నర్వాల్, సుధాకర్ తదితరులు అలరించారు. సాంకేతికవర్గం పనితీరు: నలుగురు సినిమాటోగ్రాఫర్లు ఈ చిత్రానికి వర్క్ చేసినప్పటికీ.. రాజీవ్ రవి నేచురల్ లైటింగ్ లో తీసిన సీన్స్ బాగున్నాయి. ఇన్వెస్టిగేటింగ్ సీన్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు. అయితే.. క్లైమాక్స్ ఫైట్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కాస్త బాగుండి ఉంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చేది. రాహుల్ రాజ్ పాటలు సోసోగా ఉన్నా.. గోపీసుందర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి.
దర్శకుడు వినోద్ విజయన్ రాసుకున్న కథ, కథనంలో మంచి పట్టు ఉంది. అయితే.. వాటిని తెరపై ప్రెజెంట్ చేసిన తీరులో ఆసక్తి లోపించింది. హీరోకి అన్నీ విషయాలు ఎలా తెలుస్తున్నాయి? మర్డర్ స్పాట్స్ దగ్గర క్లూస్ ను ఎలా డీకోడ్ చేస్తున్నాడు అనేవాటికి లాజికల్ ఆన్సర్స్ లోపించడంతో.. షెర్లాక్ సంపత్ లా అనిపిస్తుంది. విలన్ ఎవరు అనేది నిజంగానే మంచి సస్పెన్స్ మైంటైన్ చేశాడు కానీ.. దాన్ని రివీల్ చేసే విధానం ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఒక దర్శకుడిగా కంటే రైటర్ గా మంచి మార్కులు సంపాదించుకున్నాడు వినోద్ విజయన్.
విశ్లేషణ: టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించిన తీరు లోపించినప్పటికీ.. ఒక థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న చిత్రం “ఒక పథకం ప్రకారం”. ఎప్పుడో 2015లో రూపొందించిన సినిమా కావడం, మెయిన్ ఆర్టిస్టులైనా సముద్రఖని, కళాభవన్ మణిల డబ్బింగ్ సరిగా లేకపోవడం కారణంగా క్వాలిటీపరంగా చాలా వీక్ సినిమాగా నిలిచింది. ప్రస్తుత తరం ప్రేక్షకులు క్వాలిటీకి ప్రాధాన్యతనిస్తున్న ఈ తరుణంలో ఈ చిత్రం థియేటర్లలో నిలదొక్కుకోవడం అనేది కాస్త కష్టమే. అయితే.. నటుడిగా సాయిరాం శంకర్ పొటెన్షియల్ ను ప్రస్తుత తరానికి పరిచయం చేసేందుకు మాత్రం ఈ చిత్రం ఉపయోగపడుతుంది.
ఫోకస్ పాయింట్: పూర్తిస్థాయిలో ఫలించని పథకం!
రేటింగ్: 2/5