ఇంట్రో : విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఒక్కడొచ్చాడు”. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సూరజ్ దర్శకుడు. బ్లాక్ మనీ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : అర్జున్ (విశాల్) పూర్వ జన్మ అనే నాటకంతో డిజిపి చంద్రబోస్ (జగపతిబాబు) చెల్లెలు దివ్య (తమన్నా)ను ప్రేమలో పడేస్తాడు. దివ్యను ఉపయోగించుకొని చంద్రబోస్ అక్రమంగా దాచిపెట్టిన 250 కోట్ల రూపాయలను దొంగిలించి పారిపోతాడు. చంద్రబోస్ తో పాటు కొంతమంది పొలిటీషియన్స్ దగ్గర్నుంచి కూడా కోట్ల రూపాయల నల్లధనాన్ని దొంగిలించి హవాలా రూపంలో వేరే ఉర్లకు పంపిస్తుంటాడు. తాము ఏళ్ళు తరబడి కూడబెట్టుకొన్న నల్లధనం అర్జున్ నిమిషంలో మాయం చేసేయడంతో పోలీస్ అండ్ రౌడీ గ్యాంగ్ కలిసి అర్జున్ కోసం వేట మొదలుపెడతారు. అసలు అర్జున్ (విశాల్) ఎవరు, ఇన్ని కోట్ల రూపాయలను ఎందుకు దొంగతనం చేస్తున్నాడు, ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడు వంటి ప్రశ్నలకు పస లేని సమాధానాల సమాహారమే “ఒక్కడొచ్చాడు” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు :
విశాల్ పోషించిన అర్జున్ పాత్ర వ్యవహారశైలిలో కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ ఏమాత్రం కొత్తదనం ఉండదు. ఇక కామెడియన్స్ సూరి, వడివేలుతో కలిసి విశాల్ చేసే కామెడీ సీన్లకి నవ్వాలో ఎడ్వాలో అర్ధం కాని పరిస్థితి ప్రేక్షకులది. ఓ మూడు పాటల్లో అందాలు ఆరబోయడం, ఒక అయిదారు సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ తరహాలో హీరో వెనుక నిల్చోవడం మినహా మరో పని లేనట్లుగా ఆమె పాత్రని డిజైన్ చేశారు.
విలన్ గా మారాక జగపతిబాబు పోషించిన పనికిమాలిన పాత్రల్లో “ఒక్కడొచ్చాడు” సినిమాలోని డిజిపి చంద్రబోస్ ఒకటిగా చెప్పుకోవచ్చు. కమెడియన్స్ సూరి, వడివేలులు హీరో చేతిలో తన్నులు తినడం ఎక్కువ, కామెడీ చేయడం తక్కువ. వారి క్యారెక్టరైజేషన్స్ కూడా అదే స్థాయిలో ఉండడం బాధాకరం. ముఖ్యంగా మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అయిన వడివేలును కుక్క కంటే దారుణంగా కొట్టడం, ఆ చితకొట్టుడు ద్వారా చెత్త కామెడీ క్రియేట్ చేయాలని చేసిన ప్రయత్నం పరమచెత్తగా ఉంది.
సాంకేతికవర్గం పనితీరు : హిప్ హాప్ తమిళ (ఆది) బాణీలు బాగున్నప్పటికీ.. వాటి ప్లేస్ మెంట్ సరిగా లేకపోవడంతో, అప్పటికే చాలా చిరాగ్గా కుర్చీలో కూర్చోన్న ఆడియన్ ఇంకాస్త అసహనానికి లోనవుతుంటాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు వేటికవే ఒకదానితో ఒకటి పోటీపడి నీచమైన ఔట్ పుట్ ను ఇచ్చాయి. సో, సాంకేతికవర్గం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఇక వరుసగా “బ్యాడ్ బోయ్, సకల కళా వల్లవన్” లాంటి సూపర్ ఫ్లాప్స్ కి ఇప్పుడు “ఒక్కడొచ్చాడు” అనే మరో ఫ్లాప్ ను తగిలించుకొని హ్యాట్రిక్ ఫ్లాప్ సొంతం చేసుకొన్నాడు దర్శకుడు సూరజ్. కథ-కథనాలపై కనీస స్థాయి జాగ్రత్త చూపక, ఏదో నాలుగు కామెడీ సీన్లతో కథను చుట్టేద్దామని సూరజ్ చేసిన ప్రయోగం దారుణంగా బెడిసికొట్టడంతోపాటు ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారింది.
విశ్లేషణ : తమన్నా ఉంది కదా ఆమె అందాలతో కనువిందు చేసుకొందామనో, విశాల్ ఉన్నాడు కదా మాస్ యాక్షన్ సీన్లు ఉంటాయేమో అని ఆశపడి థియేటర్ లోకి వెళ్ళిన ప్రేక్షకుడు “ఎందుకు వచ్చాన్రా భగవంతుడా ?!” అని తలబాదుకొనేలా చేసే సినిమా “ఒక్కడొచ్చాడు”. రెండ్రోజులాగితే థియేటర్ లో ఒక్కడు కూడా మిగలడు.
రేటింగ్ : 1/5