2022లో మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న “జయ జయ జయ జయ హే”కి రీమేక్ గా రూపొందిన తెలుగు చిత్రం “ఓం శాంతి శాంతి శాంతి” (Om Shanti Shanti Shantihi). ఏ.ఆర్.సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బా (Eesha Rebba) కీలకపాత్రలు పోషించారు. 2026లో ఒక రీమేక్ సినిమా తీయడం అనేది పెద్ద రిస్క్, అయితే ఈ రిస్క్ విషయంలో నిర్మాత సృజన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ తెలుగు రీమేక్ మలయాళ మాతృకను మైమరపించగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ: ఇది ప్రతి ఇంటి ఆడపిల్ల కథ. ఆడపిల్ల అంటే ఇంటి పరువు అనే ఆలోచనాధోరణితో అతిజాగ్రత్తతో వాళ్లని కాపాడుకుంటున్నాం అనుకుని బంధించి పెట్టే సమాజానికి, కుటుంబ పెద్దల బడాయిలకి అద్దం పట్టే కథ.
ప్రశాంతి (ఈషా రెబ్బా) చిన్నప్పటినుండి తండ్రి, బాబాయ్, అన్నయ్యల అదుపులో పెరిగి, కనీసం పెళ్లయ్యాక సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే.. భర్త ఓంకార్ (తరుణ్ భాస్కర్) కూడా ఆడదంటే తన కనుసన్నల్లోనే ఉండాలి అనుకునే వ్యక్తి కావడంతో.. పెనం మీద నుండి పొయ్యిలో పడిన తన జీవితాన్ని సహించలేక, భరించలేక.. తనను అణగదొక్కుతున్న అదే సమాజం, కుటుంబం కోసం లాక్కొస్తూ ఉంటుంది.
ఆ అణిచితను ప్రశాంతి ఎదిరిస్తే ఏం జరిగింది? దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: పక్కా తెలంగాణ అబ్బాయి అయిన తరుణ్ భాస్కర్ గోదావరి యాసలో అదరగొట్టాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ & పంచులు బాగా పేలాయి. అలాగే.. రెగ్యులర్ మగాడి మైండ్ సెట్ ను పుణికిపుచ్చుకుని ఆ బాడీ లాంగ్వేజ్ & గర్వాన్ని బాగా ప్రదర్శించాడు.
ఈషా రెబ్బాకి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర లభించింది. నిజానికి సినిమా మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రశాంతి పాత్రలో బేలతనాన్ని, నిస్సహాయతను, తెగువను అర్థవంతంగా ప్రదర్శించింది. అయితే.. నిస్సహాయత నుండి తెగువ చూపే ట్రాన్సఫర్మేషన్ ఇంకాస్త ప్రస్ఫుటంగా ప్రాజెక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే.. సినిమాకి అదే మెయిన్ పాయింట్. అదొక్కటి మాత్రం మిస్ అయ్యింది.
బ్రహ్మాజీ పంచులు భలే పేలాయి. మావయ్యగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, వెటకారం సినిమాకి మంచి ఫన్ యాడ్ చేసింది. తల్లి పాత్రల్లో సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి ఒదిగిపోయారు.
ధీరజ్ సన్నివేశాలు లిమిటెడ్ అయినా.. తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆడియన్స్ అతడ్ని నోటీస్ చేసేలా చేసుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: జయ్ క్రిష్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. గోదావరి ప్రాంతం తాలూకు నేటివిటీని తన పాటలు, నేపథ్య సంగీతంలో చక్కగా మేళవించాడు. అలాగే.. సాహిత్యం అర్థమయ్యేలా, వినిపించేలా సౌండింగ్ ఉండడం ప్రశంసార్హం.
సినిమాటోగ్రాఫర్ దీపక్ ఫ్రేమింగ్స్ & కలర్ టోన్ విషయంలో తీసుకున్న కేర్ బాగుంది. ముఖ్యంగా చిన్నప్పటి ఎపిసోడ్స్ కి బ్రౌన్ టింట్ తో డిఫరెన్స్ తీసుకొచ్చాడు. అదే విధంగా లైటింగ్ కూడా బాగుంది. ఆర్ట్ వర్క్ చాలా ఆర్గానిక్ గా ఉంది. రెండు ఇళ్లు భలే సెట్ చేశారు.
ఇక దర్శకుడు సజీవ్ విషయానికి వస్తే.. ఒక దర్శకుడిగా, రచయితగా మెటాఫరికల్ గా చాలా విషయాలని సినిమాలో జొప్పించాడు. టైటిల్ కార్డ్ నుండి క్లోజింగ్ ఫ్రేమ్ వరకు ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. అయితే.. ఒరిజినల్ సినిమా చూశాక ఈ రీమేక్ చూడడం ఎలాంటి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి.. ఈ సినిమా పరంగా చూసుకుంటే, మొదటినుండి స్త్రీ స్వేచ్ఛ అణిచివేత, సాధికారత అనే అంశాల గురించే సినిమా అనే భావన కలిగించి, ఏదో ఒక పాయింట్ లో ఈ అమ్మాయి కచ్చితంగా ఎదురుతిరుగుతుంది అనే యాంటిసిపేషన్ పాయింట్ ను ట్రైలర్ లోనే రివీల్ చేయడం అనేది సరికాదు.
ఎందుకంటే.. ఎంత ఒరిజినల్ అందరికీ తెలిసినప్పటికీ, అది చూడనివాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్లకి కనీసం అది ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేది కదా. ఎందుకంటే.. మలయాళంలో అమ్మాయి ఎదురు తిరిగి కొట్టడం అనేది హైలైట్ పాయింట్. అది ఒక సస్పెన్స్ లా ట్రీట్ చేశారు అక్కడి మేకర్స్. అందుకే అది భీభత్సంగా పేలింది. తెలుగు మేకర్స్ కూడా ఆ భీకర యుద్ధాన్ని ట్రైలర్ లో చూపించకుండా, సినిమాలోనూ ఇంకాస్త డిఫరెంట్ గా ప్రాజెక్ట్ చేసి ఉండాల్సింది. అలాగే.. ఈ అమ్మాయి ఎదురు తిరగగలదా? అయ్యో పాపం అనవసరంగా చెంప దెబ్బలు తింటుంది అనే భావన ప్రేక్షకుల్లో కలగలేదు. అందుకు కారణం ఫిజికల్ అప్పీరియన్స్.
తలుచుకుంటే గట్టిగా కొట్టగలదు అనే భావన కలుగుతుంది కానీ.. పాపం కొట్టలేకపోతుంది అనే జాలి వేయదు. అది కూడా సినిమాలో కానీ, సినిమా యొక్క ఎమోషన్ లో కానీ ఆడియన్స్ లీనమవ్వకపోవడానికి కారణం. అయితే.. దర్శకుడు సజీవ్ కి క్రాఫ్ట్ మీద ఉన్న పట్టు & క్లారిటీకి “ఓం శాంతి” (Om Shanti Shanti Shantihi) చిత్రం ప్రతీకగా నిలవదు, అతడి ఆలోచనాధోరణి, చిన్నపాటి డీటెయిలింగ్ విషయంలో అతడు తీసుకునే కేర్ కి మంచి ఒరిజినల్ సినిమాయే సమాధానం అవుతుంది.
విశ్లేషణ: తెలిసిన కథ, చూసిన కథ అయినా.. చెప్పే విధానం కొత్తగా, ఆసక్తికరంగా ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే.. ఎప్పుడైతే ఒరిజినల్ సినిమాలోని నావెల్టి, హ్యూమర్ & సెటైర్ మిస్ అవుతుందో.. సరిగా వర్కవుట్ అవ్వడం లేదు అనిపిస్తుంది. “జయ జయ జయ జయ హే” ఒక మంచి సోషల్ సెటైర్ కూడా. “ఓం శాంతి శాంతి శాంతి” (Om Shanti Shanti Shantihi) ఆ సెటైర్ ను మిస్ అయ్యింది. అందువల్ల ఒక సినిమాగా పర్వాలేదు అనిపించినా.. సినిమా యొక్క ఆత్మను సరిగా క్యారీ చేయలేదు అనే భావన కలిగిస్తుంది. ఒకవేళ ఒరిజినల్ సినిమా చూడకపోతే మాత్రం.. మరీ ఎక్కువగా క్లాస్ పీక భావన కలగదు. అయితే.. టెక్నికల్ గా మాత్రం చాలా మంచి సినిమా. సంగీతం, కెమెరా వర్క్, ఎడిట్ ప్యాటర్న్ వంటివి క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి.
ఫోకస్ పాయింట్: ప్రశాంతి ఉగ్రరూపస్య.. ఓంకార మగాహంకార శాంతిః
రేటింగ్: 2/5