Tollywood: నాయకుడు కాడొదిలేశాడు… కొత్తాయన అంతంతమాత్రమే!

ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు… చాలా సినిమాల్లో ఈ డైలాగ్‌ వినే ఉంటారు. ఆ తర్వాత మీ జీవితంలో కూడా ఎక్కడోయ దగ్గర ఆ మాట వాడే ఉంటారు. అయితే ఆ డైలాగ్‌ను సినిమా పరిశ్రమ మీదే వాడాల్సి వస్తే… చాలా బాధగా ఉంటుంది కదా. కానీ అదే పరిస్థితి ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వచ్చింది. అవును మీరు విన్నది కరెక్టే, అనుకుంటున్నదీ కరెక్టే. సినిమా పరిశ్రమకు పెద్దన్న లేకపోవడం గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చిత్ర పరిశ్రమలో పెద్దన్న పాత్ర అంటే ఠక్కున గుర్తొచ్చేది ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు. ఆయన తర్వాత ఆ స్థానం ఇప్పటికీ ఖాళీనే.

మధ్యలో చిరంజీవి ఆ స్థానంలోకి వస్తారని చాలామంది అనుకున్నారు. ఆయన మనసులో కూడా అదే ఆలోచన ఉందని వార్తలొచ్చాయి. కరోనా సమయంలో ఇండస్ట్రీ గురించి ఆయన తీసుకున్న శ్రద్ధ, చేసిన సేవా కార్యక్రమాలు, కొన్ని అంశాల గురించి ప్రస్తావించిన తీరు… చూసి జనాలు ఇక ఇండస్ట్రీకి చిరంజీవే పెద్దన్న అవుతారు అని అనుకున్నారు. అందుకు తగ్గట్టే చిరంజీవి అడుగులు కూడా కనిపించాయి. కానీ ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. ‘నేను పెద్దన్న పాత్ర పోషించను’ అంటూ చిరంజీవి తేల్చేశారు. దీంతో సమస్య తిరిగి మొదటికొచ్చింది.

పోనీలే చిరంజీవి కాకపోతే మోహన్‌బాబు అయినా ముందుకొస్తారులే అన్న చిన్న ధైర్యం ఒకటి కొందరిలో కనిపించింది, వినిపించింది. కొడుకు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఉండటం, పరిశ్రమ మీద పట్టు కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుండటం వంటి కారణాలతో మోహన్‌బాబు ‘పెదరాయుడు’ అవుతారు అని అనుకున్నారు. అనుకున్నట్లుగానే చిరంజీవి ‘కాడి’ వదిలేసిన ప్రకటన తర్వాత సాయంత్రానికి మోహన్‌బాబు నుండి పరిశ్రమ కష్టాల గురించి లేఖ వచ్చింది. దీంతో ‘నాయకుడు’ దొరికాడు అని అందరూ అనుకున్నారు.

అయితే లేఖ మొత్తం చదివాక పరిస్థితి మారిపోయింది. నాయకుడు వచ్చాడు… అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, సీఎంలను గౌరవించండి, కష్టాలు చెప్పుకోండి, నేను కూడా లేఖ రాస్తాను అని ఓ లేఖ రాశాడు ఆ కొత్త నాయకుడు మోహన్‌బాబు. అంతేకాదు నిర్మాతల మండలి ఈ విషయంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు అంటూ వాళ్ల మీద ఓ రాయి విసిరారు. అందరం కలసి పరిశ్రమను కాపాడుకుందాం అంటూ మరో ప్రకటన కూడా ఆ లేఖలో చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మోహన్‌బాబుకు మంచి అనుబంధమే ఉంది.

రాజకీయ అనుబంధాలు, బంధాలతో మోహన్‌బాబు ముందుకొచ్చి సీఎంలతో భేటీ ఏర్పాటు చేసి ఏపీలో టికెట్ల సమస్యను చిటికెలో మాయం చేసేయొచ్చు. కానీ ఆయన ఆ దిశగా ఆలోచించలేదు. పరిశ్రమ అంటే నలుగురు కాదు… అందరూ అంటూ స్టీరియో టైప్‌ డైలాగ్‌లు వేశారు. దీంతో నాయకుడు వచ్చాడు కానీ ఏమీ చేయలేదు అనే పరిస్థితి వచ్చింది. పోనీ ఈ లేఖ శాంపిల్‌ మాత్రమే. తర్వాత ఏమైనా స్టెప్‌ వేస్తారా? తెలుగు సినిమా పరిశ్రమ సమస్యను తీర్చి ఇండస్ట్రీకి ‘పెద రాయుడు’ అవుతారా? అనేది చూడాలి. ఒకవేళ ఇదే జరిగితే అంతా ఆనందమే. లేదంటే టాలీవుడ్‌ కష్టం పగోడికి కూడా రాకూడదు అని మరోసారి అనాల్సి ఉంటుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus