‘నీ నోరు భరించలేం బాబోయ్’ అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు ‘నీ సోషల్ మీడియా పోరును భరించలేం బాబోయ్’ అని అంటున్నారు. ఎందుంటే ఎలన్ మస్క్ అవకాశం ఇచ్చాడు కదా అని 140 అక్షరాల్లో కొంతమంది అంతకుమించిన అక్షరాల్లో విషం గుమ్మరిస్తున్నారు. సినిమా వాళ్లకు ఈ సమస్య ఇంకా బాగా తెలుసు. సినిమా మొదలైనప్పటి నుండి.. విడుదలైనంత వరకు అదే డ్యూటీ అనుకుని విషం చిమ్ముతున్నారు. ఇంకొందరు వ్యక్తిగతంగా విమర్శలు చేసి మరింత దిగజారుతున్నారు. ఇలాంటి ఓ ఘటన కన్నడ సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతోంది.
ఇక్కడ బాధితురాలు ప్రముఖ నటి రమ్య స్పందన. ‘నిన్ను రేప్ చేసి చంపేస్తాం’, ‘రేణుకాస్వామి బదులు నువ్వే చనిపోవాల్సింది’ అంటూ నటుడు దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో రమ్యను బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఆమె బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలుసుకుని ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ బెదిరింపులపై నా లాయర్‌తో చర్చించాను. నాకు వచ్చిన బెదిరింపుల మెసేజ్‌లను పోలీసుల దృష్టికి తీసుకువెళ్తాను. ఆ కామెంట్స్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాను అని రమ్య తెలిపారు.
గతంలోనూ ఇలాంటి వేధింపుల గురించి రమ్య మాట్లాడింది. ఇలా చేసే వారు తప్పించుకొని తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కామెంట్స్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని చెప్పింది. కొన్ని నెలల క్రితం నటుడు దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడపై అసభ్య వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో దర్శన్‌ను అరెస్టై, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది.
ఈ క్రమంలో ఈ హత్య కేసుపై రమ్య స్పందిస్తూ.. రేణుకాస్వామికి, దర్శన్ అభిమానులకు తేడా లేదు. వాళ్లంతా ఒకేలా మహిళలను వేధిస్తున్నారు అని కామెంట్ చేశారు. అప్పటి నుండి దర్శన్ అభిమానులు రమ్యను సోషల్ మీడియాలో వేదిస్తున్నారు. ఇక కల్యాణ్ రామ్ ‘అభిమన్యు’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన రమ్య ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. కన్నడ, తమిళంలో సినిమాలు చేసి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీ అయ్యారు.