ఇండియన్ సినిమాలో స్టార్ హీరోయిన్ల మాటలకు విలువ ఎక్కువ. సినిమా పరిశ్రమలోని కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల గురించి వారు మాట్లాడితే ఎక్కువ మంది చర్చించుకుంటారు. ఇలా డిస్కషన్ పాయింట్లు రేపిన హీరోయిన్లలో దీపిక పడుకొణె ఒకరు. ఆమె సినిమా పరిశ్రమలోని విషయాలతోపాటు, మహిళలు ఈ సమాజంలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి కూడ గళమెత్తింది. అయితే ఇప్పుడు రెండు సినిమాల నుండి తప్పుకోవడం (తప్పించడం)తో కొన్ని నోళ్లు, వేళ్లు ఆమెను తప్పుపట్టాయి. ఈ క్రమంలో గతం మరచిపోవడం, ఇండస్ట్రీలో పరిస్థితులు బయటకు రాకపోవడం కారణంగా మారాయి.
మహిళలు – డిప్రెషన్.. ఈ టాపిక్ గురించి బయట మాట్లాడటానికి ఎవరూ ముందుకు రారు. అందులోనూ సినిమా పరిశ్రమలో మహిళలు ఇంకా మాట్లాడరు. కానీ దశాబ్ద కాలంగా దీపిక డిప్రెషన్ అనే అశంలో పోరాటం చేస్తోంది. తనలా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. 2015లో ‘ది లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్‌ను స్థాపించింది. అయితే ఆ సంస్థను ప్రారంభించినప్పుడు విమర్శలు వచ్చాయి. ఒక సెలబ్రిటీ బయటకు వచ్చి మానసిక ఆరోగ్యం గురించి తన అనుభవాన్ని పంచుకోవడం పబ్లిసిటీ కోసం అంటూ విమర్శించారు. కానీ అవేమీ పట్టించుకోలేదు. అది ఆమె ఇండివిడ్యువాలిటీ, ధైర్యానికి ప్రతీక.
ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా షూటింగ్ సమయంలో నటుడు జరిగిన ఓ విషయాన్ని నటుడు శశ్వత ఛటర్జీ (కమాండర్ మానస్) ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఓ రోజు షూటింగ్ కోసం దీపిక పడుకొణె తనకు చెప్పినట్లుగా ఉదయం 9 గంటలకే వచ్చిందట. అయితే ఆమె తొలి షాట్‌ని సాయంత్రం 5 గంటలకు తీశారట. అప్పటివరకు ఇతర నటుల సీన్స్ తీశారట. అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చినా ఆమె ఏం మాట్లాడకుండా తన సీన్ వచ్చేంతవరకు ఆగారట. అప్పట్లోనే ఈ విషయం బయటకు వచ్చినా పెద్దగా చర్చకు నోచుకోలేదు. ఇప్పుడు దీపిక ‘పని గంటల’ విషయంలో మాట్లాడేసరికి ఆమెకు సంబంధించిన రెండు అంశాలు బయటకు వచ్చాయి.