ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
అనంతరం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్ అడివి మాట్లాడుతూ ‘‘మాది క్రాస్ జోనర్ ఫిల్మ్. వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తీసిన ఫిక్షనల్ ఫిల్మ్. ఈ సినిమా ప్రయాణంలో అబ్బూరి రవి నాకు ఎమోషనల్ సపోర్ట్ గా నిలిచారు. బ్యాక్ బోన్ లా నిలబడ్డారు. కశ్మీర్ నుండి ఇతర ప్రాంతాలకు వచ్చి సెటిలైన కశ్మీర్ పండిట్స్‌తో కూర్చుని, వాళ్లతో మాట్లాడి… అసలేం జరిగింది? అని సమస్య లోతుల్లోకి వెళ్లి, కంప్లీట్ రీసెర్చ్ చేసి అబ్బూరి రవి స్ర్కిప్ట్ రాశారు. రామజోగయ్య శాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యం అందించారు. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి, ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం, ఇంకా శషా చెట్రి, కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి కృతజ్ఞతలు’’ అని అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘‘నాకు సాయికిరణ్ అడివిగారు ఈ కథ చెప్పి… అందులో ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ క్యారెక్టరైజేషన్ చెప్పారు. అప్పటికి కశ్మీర్‌లో సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నంత లేవు. కశ్మీర్ సమస్యను మేం పబ్లిసిటీకి వాడుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం సాయికిరణ్ అడివిగారు కథ రాసుకున్నారు. ఈ సినిమాలో కొన్ని నిజాలు చెప్పాం. హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాం. వాటిపై సాయికిరణ్‌గారు, అబ్బూరి రవిగారు చాలా రీసెర్చ్ చేశారు. డైలాగులు, స్ర్కీన్‌ప్లేలో హోమ్‌వర్క్ చేశారు. డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. రియల్ పాయింట్‌కి కొంచెం ఫిక్షన్ యాడ్ చేశాం. మరోపక్క రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు చూస్తారని ఆశిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన సాయికిరణ్ అడివిగారికి, మంచి డైలాగులు, స్ర్కీన్‌ప్లే రాసిన అబ్బూరి రవిగారికి థ్యాంక్స్. యాక్టర్స్, టెక్నిషియన్స్ అందరూ మంచి సినిమా చేయబోతున్నామనే ప్రేమతో, ఇష్టంతో చేశారు.’’ అని అన్నారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో విలన్ ఎలా ఉండాలని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు… ‘చావులో కూడా భయం ఉండకూడదు’ అని మామూలుగా మాట్లాడుకునే పద్దతిలో సాయికిరణ్ అడివిగారికి చెప్పాను. చాలామందిని విలన్ కోసం చూశారు. సడన్‌గా ఒక రోజు వచ్చి, ‘మీరే విలన్’ అన్నారు. ఓ నాలుగు నెలలు పాటు మా బావమరిదిని నా గెస్ట్ హౌస్‌కి పంపించి, ‘అక్కడ ఎక్కడన్నా సాయికిరణ్ ఉన్నాడేమో చూడండి’ అని అడిగేవాడిని. సాయికిరణ్ ఉంటే కారులో కూర్చుని రాసుకునేవాడిని. నేను ఆర్టిస్టును కాను. రైటర్‌ని. నటించాలని అనుకోలేదు. నా చుట్టూ నాలుగు నెలలు తిరిగాడు. ‘మన యాక్షన్ చూస్తే తనే వదిలేస్తాడు’ అనుకున్నా. మేకప్ టెస్ట్ చేశాక… నాకూ ఆ లుక్ కొంచెం నచ్చింది. బాగానే ఉన్నానని అనుకున్నా. మామాలుగా నేను ప్రతి ఉదయం పూజ చేసి, బొట్టు పెట్టుకుంటాను. అటువంటి నన్ను ఇండియాను తిట్టమంటాడు. కశ్మీర్ పండిట్స్‌ను చంపమంటాడు. క్యారెక్టర్ ప్రకారం. అది నా వల్ల కాదు. ఎందుకంటే… నా బ్లడ్‌లో దేశభక్తి ఉంది. ఒక సన్నివేశలో జీహాద్ అనాలి. టేక్ అయిపోయింది. కానీ, నేను జైహింద్ అన్నాను. చుట్టుపక్కల నాతో ఉన్న టెర్రరిస్టులు కూడా జైహింద్ అన్నారు. సాయికిరణ్ కూడా ఓకే అన్నాడు. తర్వాత ‘జైహింద్ కాదు సార్, జీహాద్ అనాలి’ అన్నాడు. పిఎంవో, జమ్ము కశ్మీర్ సొసైటీ, హైదరాబాద్‌లో ఉన్న కశ్మీర్ పండిట్స్‌తో మాట్లాడి స్ర్కిప్ట్ రాశాం. మొత్తం సినిమా కశ్మీర్ పండిట్స్ సమస్య మీద కాదు. కానీ, మనం టచ్ చేస్తున్న ఏ ఒక్కటీ అబద్దం కాకూడదని వర్క్ చేశాం. ఇండియా తాలూకు ఎమోషన్ టచ్ చేసే మేటర్ కనుక, కల్పితాలు మాట్లాడకూదనుకున్నాం. అందుకని, ఆర్టికల్ 370, 35ఎ గురించి మొత్తం తెలుసుకుని సినిమా చేశాం. ఆర్టిస్టుగా నేను సరిపోయానా? లేదా? అని మీరు (ప్రేక్షకులు) చెప్పాలి’’ అన్నారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ మధ్య కాలంలో సినిమా బయటకు రావాలంటే ఎన్ని వ్యయప్రయాసలు పడాలో నాకు తెలుసు. ఇటువంటి మంచి డేట్ ఎంచుకుని, సినిమాను విడుదల చేయడం కష్టసాధ్యమైన విషయం. ఈ టీమ్ ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చి ఇక్కడవరకూ వచ్చారో నాకు తెలుసు. కాంటెంపరరీ కశ్మీర్ ఇష్యూతో సినిమా తీశారు. ఈ సినిమాలో నాలుగు మంచి పాటలు కుదిరాయి. అన్నీ ప్రజాదరణ పొందాయి. గాంధీ జయంతికి కీరవాణిగారు పాడిన ‘మహాత్మ’ పాట విడుదల చేశాం. రీ రికార్డింగ్ పండిట్ శ్రీచరణ్ పాకాల మరోసారి అదరగొట్డాడు. సరైన సమయంలో సినిమా విడుదలవుతుంది. వీళ్లందరి కృషిలో ఒక నిజాయతీ, ఒక పద్దతి, ఒక సత్యం ఉన్నాయి. ఈ సినిమాకు మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘అక్టోబర్ 18కి కొన్ని రోజులే ఉంది. ఈ సినిమాకు అందరూ కష్టపడి పని చేశారు. ఈ సినిమాతో సాయికిరణ్ అడివి నాకు బ్రదర్‌లా అయ్యారు. ఒక సినిమాను మనిషి ఇంత ప్రేమిస్తాడా? అని ఫస్ట్ టైమ్ సాయికిరణ్ అడివిగారిని చూసి అనుకున్నాను. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. ఈ రోజుల్లో సినిమా విడుదల కావడం పెద్ద విషయం. సాయికిరణ్‌గారు ఇంటికి వెళ్లకుండా ఎడిటింగ్ రూమ్‌లో నిద్రపోయి ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది’’ అన్నారు.
నిత్యా నరేష్ మాట్లాడుతూ ‘‘సినిమా కోసం ఎంతైనా కష్టపడే వ్యక్తుల్లో సాయికిరణ్ అడివిగారు ఒకరు. స్ర్కిప్ట్ వర్క్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆయన చాలా డిడికేషన్‌తో వర్క్ చేశారు. నేను మిలటరీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాను. మిలటరీ నేపథ్యంలో తెరకెక్కిన ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.