తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు… ఈ సామెత గురించి మీరు వినే ఉంటారు. అంటే ఒకరిని ఇబ్బంది పెట్టాలని, లేదంటే వారిపై పైచేయి సాధించాలి అనుకుంటే.. దానికి మించిన పావును అవతలి వ్యక్తి కదుపుతారు అంటారు. ఇప్పుడు సినిమా vs ఓటీటీలో ఇదే జరుగుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఈ విషయమ్మీదే చర్చ జరుగుతోంది. ఓటీటీలను కంట్రోల్ చేయాలని సినిమావాళ్లు చూస్తుంటే.. వారికి చెక్ చెప్పాలని ఓటీటీలు చూస్తున్నాయని టాక్.
సినిమా వాళ్ల ఆలోచనలను కంట్రోల్ చేయడానికి గతంలో సినిమా జనాలు వాడిన స్ట్రాటజీని ఇప్పుడు ఓటీటీలు వాడటానికి సిద్ధమవుతున్నాయిన టాక్. కొన్నేళ్ల క్రితం సినిమాకు తెగిన టికెట్ల ఆధారంగా థియేటర్ల వాళ్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. నిర్మాతలకు డబ్బులు ఇచ్చేవారు. అంటే ఎంతమంది చూస్తే అంత డబ్బులు నిర్మాతలకు వివిధ చేతులు మారి వచ్చేవి. ఆ తర్వాత మొత్తం సినిమాను కొనుక్కోవడం, అద్దెకు తెచ్చుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. ఆ తర్వాత థియేటర్లను అద్దె ప్రాతిపదికన, లీజు ప్రాతిపదికన ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు ఆఖరిదే జరుగుతోంది.
ఓటీటీలు కూడా ఇంచుమించు ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాయని సమాచారం. ఇక్కడ టికెట్లు తెగే అవకాశం లేదు కాబట్టి.. ఎంతమంది, ఎంతసేపు చూశారు అనే అంశాల ఆధారంగా నిర్మాతలకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అంటే ఓ సినిమా స్ట్రీమ్ అవుతున్నప్పుడు… ఎన్ని నిమిషాలు చూశారు అనే విషయాన్ని లెక్కగట్టి దానికి తగ్గట్టుగా సినిమా నిర్మాతకు డబ్బులు ఇస్తారట. ఉదాహరణకు ఒక గంట స్ట్రీమింగ్‌కి ఐదు రూపాయలు అనుకుంటే..
మొత్తంగా ఆ సినిమా వంద గంటలు స్ట్రీమ్ అయితే.. రూ.500 వస్తాయి. అలా వంద మంది చూస్తే.. రూ.50,000 వస్తాయి అన్నమాట. తొలుత చిన్న సినిమాల విషయంలో ఈ స్టైల్‌ను అప్లై చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత పెద్ద సినిమాలకూ దీన్ని ఆపాదిస్తారని టాక్. అయితే ఒక్కో సినిమాకు ఒక్కో ధర ఉంటుందని అంటున్నారు. కొత్త సినిమాలను థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఇటీవల టాలీవుడ్ నిర్మాతలు తీర్మానించిన విషయం తెలిసిందే.