సినిమా పరిశ్రమ పెద్ద హీరోల గురించి కాదు కానీ.. చిన్న హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల విషయంలో ఓ డైలాగ్ వినిపిస్తుంది. అదే ‘ఈఎంఐ’. అవును కొంతమంది నటులు ఈఎంఐల కోసమే నటిస్తున్నారు అని అంటుంటారు. ఈ మాట ఇప్పటిది కాకపోయినా.. రీసెంట్‌గా మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న నటుడు పంకజ్ త్రిపాఠి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈఎంఐ కోసం నటించలేను అని క్లారిటీ ఇచ్చారు.
పంకజ్ త్రిపాఠి గత కొన్నేళ్లుగా ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. అయితే గతేడాది ‘మెట్రో ఇన్ దినో’ అనే సినిమాలో మాత్రమే కనిపించారు. అతనిని సినిమాల్లోకి తీసుకోని పరిస్థితులు అయితే ఇండియన్ సినిమాలో లేదు. కాబట్టి ఆయన సినిమాలు రాలేదు అంటే.. నటనకు బ్రేక్ ఇచ్చారు అని చెప్పుకోవాఇల. దీని గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కొన్నాళ్లపాటు తీరిక లేకుండా నటించడంతో ఇప్పుడు విరామం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు.
నాలోని నటుడిని సంతృప్తిపరిచే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. ఈఎంఐలు కట్టడానికో లేదంటే పరిశ్రమలో మనుగడ కోసం నటించను అని చెప్పారు పంకజ్ త్రిపాఠి. వరుస ప్రాజెక్టుల్లో నటించడం వల్ల విసుగొచ్చింది. దీంతో బాగా అలసటకూ గురయ్యా. నా పనిని నేను ఆస్వాదించలేకపోయాను. అందుకే బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు పాత్రల ఎంపికపై ఇప్పుడు మరింత శ్రద్ధ చూపిస్తున్నాను అని చెప్పారాయన.
పంకజ్ 2003లో కన్నడ సినిమా ‘చిగురిడా కనసు’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004లో ‘రన్’ (హిందీ)లో చిన్న పాత్రతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ‘రావణ్’, ‘ఆక్రోశ్’, ‘అగ్నిపథ్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’తో పేరు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో ‘దూసుకెళ్తా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఓటీటీల్లోకి వస్తే.. ‘సేక్రెడ్ గేమ్స్’, ‘క్రిమినల్ జస్టిస్’, ‘మీర్జాపూర్’ తదితర సిరీస్‌లతో ఆకట్టుకున్నారు.