పేపర్ బోయ్

  • August 31, 2018 / 09:58 AM IST

“వర్షం, బాబీ” చిత్రాల దర్శకుడు దివంగత శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం “పేపర్ బోయ్”. “హాఫ్ గర్ల్ ఫ్రెండ్” షార్ట్ ఫిలిమ్ తో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకొన్న జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మరో దర్శకుడు సంపత్ నంది నిర్మించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం విశేషం. సెప్టెంబర్ 7న విడుదలవ్వాల్సిన ఈ చిత్రాన్ని ప్రీపోన్ చేసి మరీ నేడు (ఆగస్ట్ 31) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ పేపర్ బోయ్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాడా లేక బోర్ కొట్టించాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకొందాం..!!

కథ : హైద్రాబాద్ లోని సైనిక్ పురిలో పేపర్ బోయ్స్ లో ఒకడైన రవి (సంతోష శోభన్) అదే ఏరియాలో ఉండే గద్వాల్ రెడ్డి కూతురు ధరణి (రియా సుమన్)ను ప్రేమిస్తాడు. ఈ ఇద్దరి ప్రేమకు కారణం అందం కాదు, ఆకర్షణ కాదు. ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉండడం. అయితే.. వీరి ప్రేమ పెళ్ళిగా రూపాంతరం చెందడానికి అంతస్తు అడ్డుగా నిలుస్తుంది. ఆ అడ్డంకిని తొలగించడం కోసం దేవుడు కథలోకి ప్రవేశపెట్టిన మరో పాత్ర మేఘ (తాన్య హోప్)ను ప్రవేశ పెడతాడు. ఈ మేఘ ఆ రవి-ధరణిల జంటను ఎలా కలిపింది? అనేది “పేపర్ బోయ్” కథాంశం.

నటీనటుల పనితీరు : సంతోష్ శోభన్ ఎలాంటి ఇబ్బందిలేకుండా తన మునుపటి సినిమా అయిన “తను నేను”లో చేసినట్లే మహేష్ బాబుని ఇమిటేట్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కుర్రాడు హీరో మెటీరీయల్ అని మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకొన్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన పంధా ఏర్పరుచుకోకుండా సింపుల్ గా ఇలా ఇమిటేట్ చేసుకుంటూ వెళ్లిపోవడం అనేది అతడి కెరీర్ కు చాలా ప్రమాదకరం. “మజ్ను” సినిమాతో ప్రియ శ్రీగా పరిచయమైన అమ్మాయి ఈ చిత్రంలో పేరు మార్చుకొని రియా సుమన్ అంటూ మరోమారు పలకరించింది. అమ్మాయి కంట్లో భావం కనబడలేదు, బాడీ లాంగ్వేజ్ లో మూమెంట్ కనిపించలేదు. ఓవరాల్ గా అమ్మాయిలో పెర్ఫార్మెన్స్ కనిపించలేదు. గ్లిజరిన్ పుణ్యమా అని కళ్ళలో నీళ్ళు మాత్రం బాగా కనిపించాయి.

చాలామంది ఫిలిమ్ మేకర్స్ లాగే జయశంకర్ కూడా విద్యురామన్ నటనను కాకుండా ఆమె సైజును వాడేసి కామెడీ క్రియేట్ చేయాలని చేసిన ప్రయత్నం బాగోలేదు. ఇక బిత్తిరి సత్తి, మహేష్ విత్త, అభిషేక్ మహర్షి పాత్రలతో చేయించిన కామెడీకి థియేటర్ మొత్తంలో ఒక్కడంటే ఒక్క ప్రేక్షకుడు కూడా నవ్వలేదు (థియేటర్ లో నేను కాకుండా మరో అరవై మంది ఉన్నారు). ఇక అన్నలుగా నటించినవారు, హీరో తల్లిదండ్రులుగా నటించినవారు, తాన్యా హోప్ పోటీపడి మరీ నేను అతి చేస్తాను అంటే కాదు నేను అతి చేస్తాను అంటూ రెచ్చిపోయి మరీ జీవించారు.

సాంకేతికవర్గం పనితీరు : భీమ్స్ అందించిన బాణీల్లో “బొంబాయి పోతావ రాజా” తప్ప గుర్తుంచుకొనే పాట మరొకటి లేదు, ఉన్న ఆ ఒక్క పాట ప్లేస్ మెంట్ కూడా సరిగా లేదు. ఇక సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్ పుణ్యమా అని సంపత్ నంది ప్రాసలు జొప్పించి మరీ రాసిన డైలాగులు కొన్ని వినబడలేదు.

“పేపర్ బోయ్” సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు ఎవరో ఒకర్ని తిట్టుకుంటూనో లేక అసహనంతో తల కొట్టుకుంటూనో కనిపిస్తాడు. ఇందుకు పూర్తి క్రెడిట్ సంపత్ నందికే ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లేతోపాటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన డైలాగులు కూడా రాసింది ఆ మహానుభావుడే. పాపం జయశంకర్ హస్తం ఎక్కడా ఉన్నట్లు కనిపించదు.

దర్శకుడిగా జయశంకర్ మార్క్ అనేది ఒకట్రెండు సన్నివేశాల్లో ఎక్కడా కనిపించలేదు. ఉన్న కొన్ని సన్నివేశాలు మరాఠీ చిత్రం “సైరత్” నుంచి ఇంకొన్ని సన్నివేశాలు మరికొన్ని బాలీవుడ్ సినిమాల నుంచి సింపుల్ గా ఎత్తేశారు. మరి సంపత్ నంది ప్రోద్భలంతో అలా చేశాడా లేక మరింకేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.

విశ్లేషణ : “పేపర్ బోయ్” కథ మన సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన “మల్లీశ్వరి” కాలానికి చెందిందైతే.. ఆ కథను డీల్ చేసిన విధానం ఏమో వెంకటేశ్ నటించిన “మల్లీశ్వరి” టైమ్ లో ఫాలో అయ్యి వదిలేసినది. అందువల్ల పోయిటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిద్దామని దర్శకుడు చేసిన ప్రయత్నం కాస్తా పేతటిక్ ఎఫర్ట్ గా మిగిలిపోయింది.

రేటింగ్ : 1.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus