“యువత” సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన పరశురామ్.. “సోలో” సినిమాతో ఫ్యామిలీ చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరని నిరూపించుకున్నారు. ఆంజనేయులు, సారొచ్చారు అనే చిత్రాలతో తడబడినా అల్లు శిరీష్ “శ్రీరస్తు శుభమస్తు” సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా చేశారు. విజయ్ దేవరకొండ, రష్మీక లతో “గీత గోవిందం” సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ వందకోట్ల క్లబ్ లో చేరడంతో పరశురామ్ నెక్స్ట్ ప్రాజక్ట్ పై ఆసక్తి నెలకొంది. ఏ హీరోతో సినిమా చేస్తారు? ఎటువంటి కథని ఎంచుకుంటారు? అనే సంగతులు తెలుసుకోవాలనే ఆత్రుత పెరిగింది. సహజంగానే రూమర్లు మొదలయిపోతాయి. అందుకే ముందుగానే పరుశురామ్ స్పందించారు. తన తర్వాత సినిమాపై క్లారిటీ ఇచ్చారు.
‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లోనే తన తర్వాతి సినిమా కూడా ఉంటుందని పరశురామ్ స్పష్టం చేశారు. మనిషికి.. దేవుడికి మధ్య నడిచే ఓ కథతో ఈ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతమాత్రాన అన్ని సోషియో ఫాంటసీ చిత్రాల జాబితాలో దీన్ని చేర్చవద్దని, ముఖ్యంగా ‘గోపాల గోపాల’, ఢమరుకం వంటి సినిమాలతో పోలిక అసలే వద్దని వివరించారు. అది ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని.. ఈ కథకు తగ్గట్లు మంచి క్యారెక్టర్లు కుదిరాయని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. వచ్చే ఏడాది సినిమా మొదలవుతుందని పరశురామ్ వెల్లడించారు. హీరో, హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. బహుశా.. మెగా హీరోల్లో ఎవరో ఒకరు చేయవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.