సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇచ్చే ఆఖరి రివ్యూ కూడా అంతే బాగుంటుంది. సినిమా టీమ్ ఎలా చేసి ఉంటే ఇంకా బాగుంటుంది అనే విషయాన్ని ఆయన వివరిస్తుంటారు. దాదాపుగా సినిమా రన్నింగ్ మీద ప్రభావం చూపించదు అని అనుకున్నప్పుడు ఆయన తన రివ్యూ చెబుతారు.
అలా నాగార్జున – ధనుష్ – రష్మిక మందన – శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన ‘కుబేర’ సినిమా గురించి పరుచూరి మాట్లాడారు. నాగార్జున సినిమా అనగానే.. ప్రేమ కథాంశం కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో మిస్ అయింది. ధనుష్ – రష్మిక మధ్య కూడా లవ్‌స్టోరీ లేదు. ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టలేకపోవడానికి ఈ రెండు అంశాలూ కారణమే అని పరుచూరి చెప్పారు.
ఇక 3 గంటల నిడివి కూడా ఓ కారణమని తెలిపారు. అంతసేపుఏ థియేటర్‌లో జనాలు కూర్చోవడం ఈ రోజుల్లో కష్టమని ఆయన ఉద్దేశం. అక్కడక్కడా.. చూసిన సన్నివేశాలనే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందిఅని చెప్పారాయన. సినిమాను ట్రిమ్ చేసి ఉంటే నిడివి తగ్గి.. కథను పక్కాగా జనాలకు చేరి మరింత వసూళ్లు వచ్చేవి. నా దృష్టిలో అయితే ఈ సినిమా మరో రూ.50 కోట్లు నుండి రూ.60 కోట్లు వసూలు చేసేది అని అంచనా వేశారు పరుచూరి గోపాలకృష్ణ.
ఇక బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ‘కుబేర’ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సినిమా సంగతి చూస్తే.. థియేటర్లలో విడుదలైన తొలి నాళ్లలో వచ్చిన రెస్పాన్స్ ఆ తర్వాత కనిపించలేదు. దీంతో తొలి వారాంతంలో వచ్చిన వసూళ్లే ఫైనల్ అయ్యాయి. ఇప్పడు ఓటీటీలో కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఇలా ఏం చెప్పినా నాగార్జున, ధనుష్ నటన అయితే సినిమా హైలైట్. ఇది ఎవరూ కాదనలేని విషయం.