అభినయం సావిత్రి ఆభరణం. ఆమె నటనకు తెలుగువారితో పాటు తమిళ ప్రజలు ఫిదా అయ్యారు. ఇప్పటి నటీమణులకు ఆమె సినిమాలు పాఠాలు వంటివి. కోట్ల హృదయాలను గెలుచుకున్న సావిత్రి సినిమాల్లో ఆమెకి ఏ సినిమా అంటే ఇష్టం, ఏ పాత్ర అంటే ఇష్టం.. అని ఇప్పటి తరం వారికి అడగాలని ఉంటుంది. బ్రతికే ఉంటే ట్విట్టర్లోనో , ఫేస్ బుక్ లైవ్ లోనో ఆమెను అడిగేసేవారు. కానీ ఆ అవకాశం లేకపోయినా.. ఆమె ఆనాడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ వెల్లడించారు. ” పరిశ్రమకొచ్చిన తొలి రోజుల్లో నాకు నటనపై అవగాహన లేదు. నేను అనేక పాత్రలను సమర్ధవంతంగా పోషించడానికి ఆ చిత్ర దర్శకులే కారణం. నేను నటించిన సినిమాలను చూస్తుంటే అందులో నటించింది నేనేనా అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఎందుకంటే క్యారక్టర్ పరంగా చూస్తే ఆ పాత్రకు ఎంతో అవగాహన, జీవితం సమాజం పట్ల సరైన అభిప్రాయం ఉండాలి. అవి అప్పుడు నాలో లేవు. అయినా ఆ పాత్రలు శాశ్వతంగా ఆలా ప్రజలు హృదయాల్లో నిలిచి పోయాయి. ఆలా చేసిన వాటిలో చెప్పుకోదగ్గ పాత్ర “దేవదాసులోని పార్వతి. పార్వతి ఓ వైపు సంప్రదాయానికి బలైపోతూ, మరో వైపు ప్రేమకోసం పరితపిస్తూ అనుక్షణం ఆవేదనకు గురవుతుంటుంది. అంతటి పాత్రను నేను ధరించి మెప్పించానంటే అందుకు కారణం దర్శకులే ” అని సావిత్రి చెప్పారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ తరం వారికే కాదు, ఈ తరం వారికి కూడా ఇష్టమైన సినిమానే.