మాంచి ఆకలి మీదున్న వాడికి.. సూపర్ బిరియానీ పెడితే ఎలా ఉంటుంది. మెతుకు వదలకుండా తినేసి ఓ హ్యాపీ లుక్ ఇస్తాడు. అలాంటి లుక్కే ఇప్పుడు బాలీవుడ్ ముఖాన కనిపిస్తోంది. ఆ మాటకొస్తే షారుఖ్ ఖాన్ ముఖంలోనూ అంతే. ఎందుకంటే బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ఆ మాటకొస్తే కొన్నేళ్ల తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ ‘పఠాన్’ సినిమా రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. వంద కోట్ల క్లబ్‌లోకి సినిమా వెళ్లడం అంటేనే గగనంగా మారిన బాలీవుడ్‌లో వెయ్యి కోట్ల సినిమా అందులోనూ కెరీర్ ఇక అయిపోయింది అనుకుంటున్న షారుఖ్ నుండి రావడం అంటే పెద్ద విషయమే కదా.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొణె, జాన్ అబ్రహం కలసి నటించిన చిత్రం ‘పఠాన్’. జనవరి 25న విడుదలైన ఈ సినిమా తాజాగా రూ. వెయ్యి కోట్ల మార్కును దాటింది. తొలి రోజు నుండే వసూళ్ల సునామీ బాక్సాఫీస్‌ని కళకళలాడించిందీ చిత్రం. షారుక్ దాదాపు ఐదేళ్ల తర్వాత నటించిన సినిమా కావడం, వివాదాలతో బలమైన ప్రచారం దొరకడంతో ‘పఠాన్’ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి.
అంచనాలకి తగ్గట్టుగా సినిమా ఉండటంతో వసూళ్ల వర్షం కురిసింది. ఈ క్రమంలో ఇన్నాళ్లుగా మన దేశంలో నెట్ వసూళ్ల లిస్ట్‌లో తొలి స్థానంలో ఉన్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ను ‘పఠాన్’ దాటేసింది. ఆ తర్వాత ‘కేజీయఫ్ 2’, ‘దంగల్’ సినిమాలు ఉన్నాయి. రూ.511.70 కోట్ల (నెట్) వసూళ్లతో ‘పఠాన్’ నంబర్ వన్‌గా నిలిచింది.
‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ వసూళ్లు రూ.510.99 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పఠాన్ వసూళ్లు రూ.1008 కోట్లు పైమాటే. ఈ లెక్కల్లో అయితే నాలుగో స్థానంలో ఉంది. అంతకంటే ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ. 1170 కోట్లు), ‘కేజీయఫ్’ (రూ. 1208 కోట్లు), ‘బాహుబలి: ది కంక్లూజన్’ (రూ. 1788 కోట్లు) ఉన్నాయి.