అదేదో సీరియల్‌లో ఓ నటి అన్నట్లు.. ‘ఏంటీ సడన్ సప్పాయ్’ అని అంటున్నారు ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ అభిమానులు. ఎందుకంటే ఎవరూ ఊహించని ఓ కాంబో దాదాపు ఓకే అయింది అని చెబుతున్నారు. దీని కోసమో ప్రముఖ తమిళ నిర్మాత వచ్చి పవన్ కల్యాణ్‌ను కలిశారు అని చెబుతున్నారు. ఆ వెంటనే ఆ సినిమా కోసం దర్శకుడు రెడీ, సంగీత దర్శకుడు కూడా రెడీ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అంత వేగంగా ఎందుకు అనుకుంటున్నారా? ఆ కాంబో తెరపైకి వస్తే బ్లాక్‌బస్టర్ లోడింగ్ అని అంచనా నమ్మకంగా చెప్పొచ్చు కాబట్టి.
ఇదంతా, ఓకే ఎవరు ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు.. దానికి పవన్ కల్యాణ్‌కి లింకేంటి అనుకుంటున్నారా? ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, మాస్ డైరక్టర్ బాబీ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ గుర్తుందా? ఆ సంస్థ నిర్మాతల్లో ఒకరైన కె వెంకట నారాయణ ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిశారట. దీంతో ఈ కాంబినేషన్‌లో ఏమన్నా సినిమా ప్లాన్ చేస్తున్నారా అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది. దీంతో డైరక్టర్ ఎవర్వొచ్చు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.
దీనికి వినిపిస్తున్న పేర్లు హెచ్ వినోద్, లోకేశ్ కనగరాజ్. వినోద్ ప్రస్తుతం కేవీఎన్‌లో ఓ సినిమా చేస్తుండగా.. లోకేశ్ కనగరాజ్ డేట్స్ ఆ సంస్థ దగ్గర ఉన్నాయట. అలాగే ‘ఖైదీ 2’ సినిమా కూడా చేస్తున్నారు. దీంతో ఇద్దరి పేర్లూ బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరికిద్దరూ మాస్, యాక్షన్ సినిమాలను ఇరగదీస్తారు. అజిత్‌కి వినోద్ మూడు మంచి విజయాలు అందించాడు. ఇక లోకేశ్ కనగరాజ్ గురించి తెలిసిందే. రీసెంట్‌గా రెండు ఆయన స్థాయి విజయాలు రాకపోయినా బ్లాక్‌బస్టర్ డైరక్టరే.
మరి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆలోచనల్లో ఏముంది అనేది తెలియడం లేదు. ఈ ఇద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా వచ్చి సినిమాను హ్యాండిల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం మరి పవన్ నెక్స్ట్ మూవీ ఇదవుతుందో లేదో?