తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్‌ఫుల్ డైలాగ్స్, అభిమానులను ఊపేసే మేనరిజమ్, మాస్ సినిమాలతో కోట్లాది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. ‘ఖుషి’, ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను మైలురాళ్లుగా నిలిపాయి. అదే సమయంలో సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు సినిమాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు.
రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన తల్లి అంజనాదేవి పట్ల ఆయన చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులను మాత్రమే కాదు, సామాన్య ప్రజలను కూడా ఆకట్టుకుంటోంది. విశాఖలోని ఇందిరా గాంధీ జువాలజికల్ పార్క్లో రెండు జిరాఫీలను ఏడాది పాటు తల్లి పేరు మీద దత్తత తీసుకొని, వాటి సంరక్షణ బాధ్యత మరియు అందుకు అయ్యే ఖర్చు స్వయంగా తానే చెలించనున్నట్లు ప్రకటించారు. జంతువుల పట్ల తన సానుభూతిని, బాధ్యతాయుతమైన ఆలోచనను మరోసారి నిరూపించారు.
మెగా కుటుంబంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు జంతు సంరక్షణలో భాగంగా చేసిన కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన ‘ఓజీ’తో బాక్సాఫీస్ వద్ద పవన్ మళ్లీ తన సత్తా చాటారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా త్వరలో ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సినిమాలు, ప్రజాసేవ, కుటుంబంపై ప్రేమ ఇలా అన్నిటిని బాలన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.