పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమా నిడివి గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సినిమా లెంగ్త్ బాగా ఎక్కువైందని.. ఈ విషయంలో చిత్రబృందం టెన్షన్ పడుతుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిముషాలు అని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమా అంటే ఈమాత్రం రన్ టైమ్ ఉండడం కామన్.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు పవన్ స్క్రీన్ టైమ్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమా మొత్తంలో పవన్ ఎంతసేపు కనిపిస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పవన్ స్క్రీన్ టైమ్ 50 నిమిషాలలోపే ఉంటుందని టాక్. ఈ సినిమా ప్రధానంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. ‘పింక్’ సినిమా కూడా అంతే.. అందులో అమితాబ్ కథ మొదలైన చాలా సేపటికి గానీ ఎంట్రీ ఇవ్వరు. అయితే ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కోసం కొన్ని సీన్లు రాసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టారు.
దీంతో ఆయన స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇన్సైడ్ వర్గాల ప్రకారం.. పవన్ కేవలం 50 నిమిషాలే కనిపించబోతున్నట్లు తేలింది. కానీ పవన్ తెరపై కనిపించే ప్రతీ సీన్ ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అని.. పరిచయం సన్నివేశాలతో పాటు ఫ్లాష్ బ్యాక్ సీన్స్, యాక్షన్ సీన్స్.. కిక్కిచ్చేలా ఉంటాయని చెబుతున్నారు. కానీ రెండున్నర గంటల సినిమాలో పవన్ యాభై నిమిషాలే కనిపిస్తాడంటే.. సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!