రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న RC16 (RC 16 Movie) సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో గాని మేకింగ్ లో మాత్రం హై లెవెల్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులలో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ టీమ్, త్వరలో ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.
RC16 టీమ్ పార్లమెంట్‌లో కొన్ని సీన్లు ప్లాన్ చేసిందట. సాధారణంగా పార్లమెంట్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ అనుమతులు పొందడం అంత తేలిక కాదు. గతంలో సినిమాలకు అనుమతులు తీసుకోవడం కొంత ఈజీగా ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు కఠినంగా మారాయి. ఈ నేపథ్యంలో టీమ్ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోందట. అయితే ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సాయపడతారని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ పరిచయాలను ఉపయోగించి ఈ అనుమతులు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, చరణ్ సినిమా కోసం ప్రత్యేకంగా తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. NDA పార్టనర్‌గా ఆయన్ని బీజేపీ నాయకులు సన్నిహితంగా చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అభయంగా RC16 టీమ్ పార్లమెంట్ అనుమతులు పొందేలా చేస్తున్నారని టాక్. ఇక ఢిల్లీలోని జామా మసీద్‌లో కూడా కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రంజాన్ తర్వాత మాత్రమే అక్కడ అనుమతులు లభించే అవకాశం ఉందట. ఈ లోగా పార్లమెంట్ షూటింగ్ పూర్తి చేసి, తర్వాత మసీద్ సన్నివేశాల కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారని సమాచారం.
మరోవైపు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) ఆరోగ్య సమస్యల కారణంగా షూటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, త్వరలోనే తిరిగి సెట్స్‌లో జాయిన్ అవుతారని సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ RC16 షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కనెక్షన్స్ వాడుతున్నారా లేదా టీమ్ సాధారణ మార్గాల్లో అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.