పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో గబ్బర్ సింగ్ సినిమా ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. ఖుషి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ ఖుషి స్థాయిలో హిట్ కాలేదు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టైన దబాంగ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి హరీష్ శంకర్ తెరకెక్కించడంతో గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది.
పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమాకు నిర్మాత అనే సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమాకు ముందే బండ్ల గణేష్ పవన్ తో జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తీన్ మార్ అనే సినిమాను నిర్మించారు. లవ్ ఆజ్ కల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. తీన్ మార్ ఫ్లాప్ తరువాత బండ్ల గణేష్ రవితేజతో గబ్బర్ సింగ్ సినిమాను చేయాలని భావించారు.
అయితే తీన్ మార్ వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చడం కోసం పవన్ మరో సినిమా చేయమని బండ్ల గణేష్ కు సూచించడంతో గబ్బర్ సింగ్ సినిమాను గణేష్ పవన్ తో నిర్మించారు. ఆ విధంగా జరగడం వల్ల రవితేజ గబ్బర్ సింగ్ సినిమాను మిస్ అయ్యారు. ఒక సందర్భంలో బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఒకవేళ గబ్బర్ సింగ్ సినిమాలో రవితేజ నటించి ఉంటే మాత్రం ఆ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి ఉండేది. తాను నిర్మాతగా మారడానికి పవన్ కారణమని అందుకే ఆయనను దేవుడిగా భావిస్తానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.