ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక కమర్షియల్ హిట్ అందుకొని చాలా ఏళ్లయ్యింది. వరుసబెట్టి ప్రయోగాలు చేస్తున్నా ఏదీ వర్కవుట్ అవ్వలేదు. దాంతో కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరైన శివ దర్శకత్వంలో “పెద్దన్న” అనే సినిమాలో టైటిల్ పాత్ర పోషించారు రజనీ. నయనతార కథానాయికగా, జగపతిబాబు విలన్ గా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ చెల్లెలి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ దీపావళికైనా రజనీ మళ్ళీ విజయాన్ని అందుకోగలిగారో లేదో చూద్దాం..!!
కథ: చెల్లెలు కనకం (కీర్తి సురేష్) అంటే అన్నయ్య వీరన్న (రజనీకాంత్)కు ప్రాణం. చెల్లెలు అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చి ఇస్తాడు. అటువంటి చెల్లెలికి రాష్ట్రాలు రాష్ట్రాలు తిరిగి ఒక పెళ్ళికొడుకుని పట్టుకొస్తాడు. ఊరంతా పండగలా పెళ్లి జరుగబోతొంది అనే తరుణంలో కనకం తాను ప్రేమించిన కుర్రాడితో కలకత్తా పారిపోతుంది. దాంతో ఊరంతా విషాదంలో మునిగిపోతుంది.
అయితే.. పారిపోయిన చెల్లెలు పీకల్లోతు కష్టాల్లో ఉందని తెలుసుకొంటాడు వీరన్న. ఏమిటా కష్టాలు? అసలు కనకం కలకత్తాలో ఏం చేస్తుంది? వీరన్న ఆమెను ఎలా కాపాడాడు? అనేది “పెద్దన్న” కథాంశం.
నటీనటుల పనితీరు: తన మునుపటి సినిమాలకంటే ఎనర్జిటిక్ గా కనిపించారు రజనీ. లేకి కామెడీ సీన్స్ లో ఆయన్ని చూడడం ఇబ్బందిగా అనిపించింది కానీ.. యాక్షన్ బ్లాక్స్ లో ఆయన మార్క్ మ్యానరిజమ్స్ తో అలరించారు. నయనతార కొన్ని పాటలకు, సన్నివేశాలకు పరిమితం అయిపొయింది. కీర్తి సురేష్ ఫస్టాఫ్ మొత్తం నవ్వుతు, సెకండాఫ్ మొత్తం ఏడుస్తూ నెట్టుకొచ్చేసింది. ఇక మీనా, ఖుష్బూలు సినిమాలో ఎందుకున్నారో దర్శకుడు శివకే తెలియాలి. ఇక మిగతా అరవ కమెడియన్స్ ఆడియన్స్ ను చిరాకు పెట్టడం ఎక్కువ, కామెడీ తక్కువ.
సాంకేతికవర్గం పనితీరు: తన మునుపటి సినిమాలైన “వేదాళం, విశ్వాసం” కలిపి “పెద్దన్న” కథను సృష్టించాడు దర్శకుడు శివ. ఫస్టాఫ్ మొత్తం రోత కామెడీతో నింపేసి.. సెకండాఫ్ ను బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ బ్లాక్స్ తో సాగదీసాడు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో చేయాల్సిన సినిమా ఇది కాదు.
అజిత్ తో తీసిన అదే తరహా సినిమాలు హిట్ అవ్వడానికి కారణం ఆయన ఆ తరహా సినిమాలు ఈమధ్యకాలంలో చేసి ఉండకపోవడం. అయితే.. రజనీ ఈ తరహా సినిమాలు తన కెరీర్ తొలినాళ్లలోనే చేసేసారు. అందువల్ల రజనీ నటించిన 80ల నాటి చిత్రాలనే మళ్ళీ చూసినట్లు ఉంటుంది. దర్శకుడు శివ ఆడియన్స్ ను అలరించడంలో దారుణంగా విఫలమయ్యాడు.
డి.ఇమ్మాన్ నేపధ్య సంగీతం మాత్రం థియేటర్లను హోరెత్తించింది. పాటలు సోసోగా ఉన్నప్పటికీ.. యాక్షన్ సీక్వెన్స్ లకు ఇమ్మాన్ నేపధ్య సంగీతం ఆడియన్స్ లో అలసత్వాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని నింపింది. వెట్రి సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ లెవెల్ లో ఉంది. కథ-కథనంతో సంబంధం లేకుండా తన బెస్ట్ ఇచ్చాడు వెట్రి.
విశ్లేషణ: కథ-కథనం-పాత్రలు వంటివేవీ పట్టించుకోకుండా కేవలం రజనీని చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ మాత్రమే చూడగలిగిన చిత్రం “పెద్దన్న”. కానీ.. రజనీకాంత్ నుంచి అభిమానులు కోరుకునే సినిమా కాదిది. ఆయన స్థాయికి ఈ తరహా సినిమాలు చేయడం ఆయన స్టామినాను ఆయన తక్కువ అంచనా వేసుకోవడమే. రజనీ వీరాభిమానులు సైతం థియేటర్ల నుంచి వాకౌట్ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు సినిమా ఏ స్థాయిలో ఉందొ.
రేటింగ్: 1.5/5