Pelli Kani Prasad Review in Telugu: పెళ్లి కాని ప్రసాద్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సప్తగిరి (Hero)
  • ప్రియాంక శర్మ (Heroine)
  • మురళీధర్ గౌడ్,అన్నపూర్ణమ్మ,వడ్లమాని శ్రీనివాస్,ప్రమోదిని , లక్ష్మణ్ మీసాల, రోహిణి , రాంప్రసాద్ (Cast)
  • అభిలాష్ రెడ్డి గోపిడి (Director)
  • కేవై బాబు, భానుప్రకాశ్‌ గౌడ్‌ ,సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్ ,వైభవ్‌ రెడ్డి ముత్యాల (Producer)
  • శేఖర్ చంద్ర (Music)
  • సుజాత సిద్ధార్థ్ (Cinematography)
  • Release Date : మార్చి 21, 2025

స్టార్ కమెడియన్ హోదా సంపాదించుకున్న అతి తక్కువ మంది కమెడియన్లలో సప్తగిరి (Sapthagiri) ఒకడు. నటుడిగా తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని మెప్పించి అగ్ర స్థాయి కమెడియన్ గా అలరారుతున్న తరుణంలో హీరోగానూ “సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి” సినిమాతో హిట్లు కొట్టాడు. ఆ తర్వాత హీరోగా నటించిన మరో రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని “పెళ్లి కాని ప్రసాద్” (Pelli Kani Prasad) అనే ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాతో హీరోగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో సప్తగిరి అనుకున్నట్లుగా హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం..!!

Pelli Kani Prasad Review

కథ: ఆల్రెడీ ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశారు. 38 ఏళ్లు వచ్చినా రెండు కోట్లు కట్నం వస్తే తప్ప కొడుక్కి పెళ్లి చేయను అని తీర్మానించుకుని కూర్చున్న తండ్రి (మురళీధర్ గౌడ్(Muralidhar Goud). కట్నం అటుంచి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుంది, ఇంకెప్పుడు పెళ్లి అని బెంగపెట్టుకున్న కొడుకు ప్రసాద్ (సప్తగిరి). ఫారిన్ మొగుడ్ని పట్టుకుంటే.. ఫ్యామిలీ మొత్తం ఫారిన్ వెళ్లిపోవచ్చు అనే పిచ్చి ఆలోచనతో ఫారిన్ సంబంధాల కోసం వెంపర్లాడే ప్రియ (ప్రియాంక శర్మ (Priyanka Sharma).

ఇలా ముగ్గురు ఆశావాదుల అత్యాశ చుట్టూ అల్లుకున్న కథ “పెళ్లి కాని ప్రసాద్” (Pelli Kani Prasad ). తండ్రి-పెళ్ళాం మధ్య నలిగిన ప్రసాద్ పరిస్థితి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సప్తగిరి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన యాసతో విశేషంగా ఆకట్టుకునే సప్తగిరి ఈ సినిమాలో కాస్త నెమ్మదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అత్తగారి కుటుంబాన్ని కొడుతున్నట్లు ఊహించునే సీక్వెన్స్ లో సప్తగిరి మార్క్ కామెడీ కనిపించింది. అక్కడక్కడా కొన్ని పంచ్ లు పేలాయి. అయితే.. డ్యాన్సులు వేయడానికి తాను ఇబ్బందిపడి, ప్రేక్షకుల్ని కూడా ఇబ్బందిపెట్టాడు సప్తగిరి.

ఇక ప్రియాంక శర్మ పర్వాలేదనిపించుకోగా.. Rohini ప్రమోదిని (Pramodini), అన్నపూర్ణమ్మ (Annapurna), వడ్లమాని శ్రీనివాస్ (Vadlamani Srinivas) కామెడీ నవ్వించడం అటుంచితే.. కచ్చితంగా విసిగిస్తుంది. మురళీధర్ గౌడ్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ వర్కవుట్ అవ్వలేదు. కిట్టయ్య, ఆటో రాంప్రసాద్ (Jabardasth Ram Prasad), మీసాల లక్ష్మణ్ (Laxman Meesala ) తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు. ఇక నటుడు భాషా ఓవర్ యాక్షన్ తో చిరాకు పెట్టించాడు.

సాంకేతికవర్గం పనితీరు: టైటిల్ సాంగ్ & ఇనీషియల్ బ్యాగ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత నిజంగానే శేఖర్ చంద్ర (Shekar Chandra) ఈ సినిమాకి సంగీతం అందించాడా అనే సందేహం కలగకమానదు. ఒక్క మెలోడీ తప్ప ఏదీ వినసొంపుగా లేదు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉన్నప్పటికీ.. హీరోని కాస్త బ్రైట్ గా చూపించడం కోసం డి.ఐలో చేసిన ప్రయత్నం తెరపై బెడిసికొట్టింది. ఆ కారణంగా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పూర్తిస్థాయిలో ఎలివేట్ అవ్వలేకపోయింది. ఇక ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి వాటి గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు.

దర్శకుడు అభిలాష్ రెడ్డి (Abhilash Reddy Gopidi) ఎంచుకున్న కథ, అ కథను నడిపించిన విధానం గురించి మాట్లాడుకునే ముందు.. ఈ సినిమాలో హీరో ఫోన్ కి పెట్టించిన రింగ్ టోన్ గురించి చెప్పాలి. సోషల్ మీడియాలో లీకైన ఓ అశుద్ధమైన అశ్లీల ఆడియో రీమిక్స్ పాటను హీరో కాలర్ ట్యూన్ గా పెట్టాలన్న ఆలోచనతోనే అతడి శైలి ఏమిటి అనేది అర్థం చేసుకోవచ్చు. “అద్దు శీను” అనే ఆ ఆడియో హిస్టరీ ఏంటి అనేది తెలియని సోషల్ మీడియా జనాలు ఉండరు, ఇదివరకు కూడా ఈ చండాలాన్ని కొన్ని సినిమాల్లో వాడినా అది విలన్ గ్యాంగ్ లేదా బ్యాగ్రౌండ్ కమెడియన్ గ్యాంగ్ కోసం వినియోగించారు.

కానీ.. ఏకంగా హీరో రింగ్ టోన్ గా అది పెట్టడం, సినిమాలో పదిసార్లకు పైగా అది ప్లే చేయడం అనేది అత్యంత జుగుప్సాకరమైన విషయం. ఇక కథనం విషయానికి వస్తే.. ఓ మోస్తరుగా పర్వాలేదు అనేలానే రాసుకున్నాడు. అయితే.. ఆర్టిస్టులు చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా కొన్ని పండలేదు. ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కాస్త నవ్వించగలిగాయి. ఓవరాల్ గా దర్శకుడిగా, కథకుడిగా అభిలాష్ రెడ్డి మెప్పించలేకపోయాడని చెప్పాలి.

విశ్లేషణ: సినిమాల్లో మీమ్స్ రిఫరెన్సులు ఉండడం వేరు, మీమ్స్ ని ఇష్టానుసారంగా సినిమాల్లో వాడుకుంటూ.. కథనంతో సంబంధం లేకుండా కేవలం మీమ్స్ తోనే కానిచ్చేద్దాం అనుకోవడం వేరు. “పెళ్లి కాని ప్రసాద్” ఈ రెండో కేటగిరీకి చెందిన సినిమా. అ మీమ్స్ కాస్త తగ్గించి, రొడ్డకొట్టుడు పంచ్ లు పక్కనెట్టి, కథలోని కీలకమైన ట్విస్ట్ & సెన్సిబిలిటీస్ ను ఇంకాస్త బెటర్ గా ట్రీట్ చేసి ఉంటే ఓ మోస్తరు సినిమాగానైనా నిలిచి ఉండేది.

ఫోకస్ పాయింట్: ఎందుకొచ్చిన పాట్లు ప్రసాదు!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus