పసందైన “పెళ్లి చూపులు”!

సరిగ్గా పన్నెండేళ్ళ క్రితం “ఆనంద్” అనే సినిమా విడుదలైంది. అప్పటికి మాంచి ఫామ్ లో ఉన్న చిరంజీవి నటించిన క్రేజీ ప్రోజెక్ట్ “శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్”కు పోటీగా విడుదలైన సినిమా అది. చిరంజీవి సినిమా కోసం వచ్చి టికెట్లు దొరక్క పక్కనే ఆడుతున్న “ఆనంద్” సినిమా వైపు అడుగులు వేశారు ప్రేక్షకులు. థియేటర్ లో కూర్చోన్నాక మొదట కాస్త స్లోగా అనిపించినా.. పోనుపోనూ సినిమాలోని ఏదో ఒక క్యారెక్టర్ తో తనను తాను పోల్చుకొన్నాడు ప్రేక్షకుడు. సినిమా అయిపోయింది.. అయినా సరే ఇంటికి తిరిగి వెళ్ళే వరకూ ఆ సినిమాలోని స్వచ్చమైన భావాలు, వినసోంపైన సంగీతం ప్రేక్షకుడి మనసులో మెదులుతూనే ఉన్నాయి.

సరిగ్గా అలాంటి భావనను కలిగించే సినిమా మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చింది. అదే తరుణ్ భాస్కర్ అనే యువ ప్రతిభాశాలి తెరకెక్కించిన “పెళ్లి చూపులు”. శేఖర్ కమ్ముల స్టైల్ ను కాపీ కొట్టాడు అనిపించినప్పటికీ.. ఓ రెండు గంటలపాటు లోకాన్ని కాకపోయినా.. సగటు మనిషి దైనందిన జీవితంలో భరించే ఎన్నో టెన్షన్లను మైమరపింపజేశాడు. సినిమాలో ఆ అబ్బాయి హీరో, ఆ అమ్మాయి హీరోయిన్, ఇతను కమెడియన్ అని ప్రత్యేకించి ఎవర్నీ చెప్పలేం. అందరూ పాత్రధారులే.. కథే హీరో, కథనమే కట్టిపడేసే కథానాయిక, సంగీతమే గుండెల్లో ఆనందాన్ని నింపే సాధనం. వీటన్నికి కలయికే “పెళ్ళి చూపులు”.

సగటు యువకుడిగా విజయ్ దేవరకొండ, జీవితంలో ఎదగాలనుకొనే యువతిగా రీతువర్మలు ఎక్కడా నటించలేదు. పాత్రకు తగ్గట్లుగా బిహేవ్ చేశారు. అలాగే తెలంగాణ యాసలో దర్శన్ పండించే కామెడీకి ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ క్లైమాక్స్ లో పేల్చే పంచ్ కు నవ్వని వారు ఉండరు.

ఇక టెక్నికల్ గానూ “పెళ్ళిచూపులు” డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. వివేక్ సాగర్ ట్యూన్స్ – బ్రాగ్రౌండ్ స్కోర్, నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్, అన్నిటికంటే ముఖ్యంగా లైవ్ సౌండ్ ఈ సినిమాకి జీవం పోయడమే కాకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచుతుంది.

గమనిక : “పెళ్ళిచూపులు” సినిమా చూసిన మేము పొందిన అనుభూతిని ప్రేక్షకులు కూడా పొందడమే కాకుండా.. “పెళ్లి చూపులు” లాంటి మంచి మరియు విభిన్నమైన చిత్రాలు మరిన్ని తెలుగులో రూపొందాలన్న ఆశతోనే ఈ “ప్రివ్యూ రిపోర్ట్” అందిస్తున్నామే కానీ.. సినిమాను పొగడాలనో లేక థియేటర్ కు వెళ్ళే ప్రేక్షకుడ్ని మోసం చేయాలన్నదో మా ధ్యేయం కాదు. మీరు కూడా మా “ప్రివ్యూ రిపోర్ట్”తో ఏకీభవించినట్లుగా మరింతమందికి “పెళ్లి చూపులు” సినిమా గురించి చెప్పి ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి వారికి కూడా కలగనివ్వండి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus