పెళ్ళిచూపులు

‘అనుకోకుండా..’,’సైన్మా’ వంటి షార్ట్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులకు పరిచయమయిన తరుణ్ భాస్కర్ తొలిసారి వెండితెరపై తన ఫీచర్ ఫిల్మ్ ‘పెళ్ళిచూపులు’ ను తెరకెక్కించాడు. తరుణ్ పనితీరు నచ్చిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్పకులుగా మారిపోయారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి తరుణ్ ఈ అంచనాలను ఎంత వరకు రీచ్ అయ్యాడో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ : ప్రశాంత్(విజయ్ దేవరకొండ) పేరు కోసం డిగ్రీ పూర్తి చేసి ఆవారాగా తన స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. కానీ ప్రశాంత్ కు వంట చేయడమంటే ఇష్టం. పెద్ద షెఫ్ అవ్వాలనేది తన కల. ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకు ఖాళీగా తిరగడం చూసిన ప్రశాంత్ తండ్రి తనకు పెళ్ళి చేస్తేనైనా.. సెటిల్ అవుతాడేమో అని పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తాడు. ఆ పెళ్ళిచూపుల్లో ప్రశాంత్ కు పెళ్లికూతురైన చిత్ర(రీతూ వర్మ)తో పరిచయం ఏర్పడుతుంది. అనుకోకుండా ఇద్దరు ఒక రూమ్ లో లాక్ అయిపోతారు. ఆ సమయంలో ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకుంటారు. ఆ సంధర్భంలో చిత్ర తను ప్రేమించిన విక్రమ్(నందు) గురించి ప్రశాంత్ కు చెప్తుంది. కానీ విక్రమ్ కొన్ని కారణాల వలన చిత్రను వదిలి వెళ్ళిపోతాడు. ఎప్పటికైనా ‘ఫుడ్ ట్రక్’ బిజినెస్ పెట్టి ఆస్ట్రేలియా వెళ్లాలనేదే తన కోరికగా చిత్ర చెబుతుంది. అయితే ప్రశాంత్ పెళ్ళిచూపుల కోసం వచ్చింది చిత్ర కోసం కాదని అడ్రెస్ మారడం వలన చిత్ర ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి చిత్ర, ప్రశాంత్ లు తన జీవితాల్లో గెలిచారా..? చిత్ర ప్రేమించిన విక్రమ్ నే పెళ్లాడిందా..? లేక ప్రశాంత్ ను ప్రేమిస్తుందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

నటీనటుల పనితీరు : విజయ్ దేవరకొండ గతంలో ఎవడే సుబ్రమణ్యం అనే సినిమాలో నటించాడు. హీరోగా తనకు ఇది మొదటి సినిమా. పాత్ర ప్రకారం తను చాలా మాసివ్ లుక్ తో కనిపిస్తాడు. సోమరిపోతులా తిరిగే అబ్బాయిగా బాగా నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రీతూవర్మ తన క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. సింపుల్ కాస్ట్యూమ్స్ లో కూడా అందంగా కనిపించింది. సినిమాలో నందు రోల్ చిన్నదైనా.. కనిపించినంతసేపు ఓకే అనిపించాడు.
ఇక ప్రశాంత్ స్నేహితులుగా నటించిన ప్రియదర్శి, అభయ్ లు ప్రేక్షకులను నవ్విస్తారు. ముఖ్యంగా ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఈ సినిమాతో తనకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.

సాంకేతికవర్గం పనితీరు : కథ, కథనం ఉంటే చాలు సినిమాకు మరేది అక్కర్లేదని నిరూపించింది ఈ పెళ్ళిచూపులు. సింపుల్ కథను తీసుకొని చక్కటి కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమానే తన ట్రీట్మెంట్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దానికి తగ్గ సంభాషణలు కుదిరాయి. ప్రాస కోసం కాకుండా సాధారణంగా అందరూ ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారో.. అలాంటి సంబాషణలనే రాయడం విశేషం. ఫోటోగ్రఫి కూడా సినిమాకు ప్లస్ అయింది. సంధర్భానుసారంగా సన్నివేశాలతో కూడిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను ఎడిట్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. అనుకున్న బడ్జెట్ లో మంచి సినిమాను తీశారు.

విశ్లేషణ : ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు నమోదు చేసుకుంటున్నాయి. ఆ లిస్టులో “పెళ్ళిచూపులు” కూడా చేరిందనే చెప్పాలి. సినిమా
మొదలయ్యి.. ఇంటెర్వెల్ వచ్చే వరకు ఎక్కడా బోర్ కొట్టే సన్నివేశాలు ఉండవు. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపించినా ఆ లోపం పెద్దగా కనిపించదు. తల్లి తండ్రులు తమ పిల్లలతో కలిసి చూడగలిగే సినిమా. క్లైమాక్స్ లో మంచి సందేశాన్ని చెప్పినా.. దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ తో జోడించి చెప్పడం వలన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలా అనిపించదు. పేరెంట్స్ ఒత్తిడితో ఇష్టంలేని చదువులు చదవడం ఫ్యాషన్ ను చంపుకొని బ్రతికే చాలా మంది వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు. వారంతా కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ అని విభజించి చెప్పలేం కానీ కొత్తదనం కోరుకునే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్ : 3.75/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus