ఆర్థిక పంచాయితీలు తేలక ‘అఖండ 2: తాండవం’ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎప్పుడు వస్తుంది అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుంది అని అంటున్నారు. ఆ విషయం అటు ఉంచితే మరో పెద్ద సినిమా కూడా గత కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యల మధ్య చిక్కుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓ బాలీవుడ్ సినిమా ఫండింగ్ సంస్థతో ఇబ్బందులు వచ్చాయని ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అలాంటిదేం లేదని, మేం విడుదలకు రెడీగా ఉన్నామని ఆ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు.
బాలీవుడ్ సినిమా ఫండింగ్ సంస్థ, సమస్య అంటే ‘ది రాజాసాబ్’ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాఉ వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని దర్శకనిర్మాతలు చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకొని, ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ‘అఖండ 2: తాండవం’ ఆగగానే మరోసారి ‘ది రాజా సాబ్’ చర్చ మొదలైంది. దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు.
బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల చివరి క్షణంలో వాయిదా పడటం తనను బాధించిందని చెప్పిన నిర్మాత విశ్వ ప్రసాద్.. విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులపై ప్రభావం చూపుతుంది. థర్డ్ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా మార్గదర్శకాలు రూపొందించడం ముఖ్యం అని అన్నారు.
‘ది రాజాసాబ్’ సినిమా కోసం తీసుకున్న అప్పులు, ఫండింగ్‌ను క్లియర్ చేసేశాం. వడ్డీని త్వరలోనే చెల్లిస్తాం అని క్లారిటీ ఇచ్చారు విశ్వప్రసాద్. అయితే సినిమా బిజినెస్ ప్రారంభించడానికి ముందే వాటిని క్లియర్ చేస్తాం అని అన్నారు. అంటే సినిమా బిజినెస్ ఇంకా అవ్వలేదని అర్థమవుతోంది.