Perusu Review in Telugu: పెరుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వైభవ్ (Hero)
  • నిహారిక ఎన్.ఎం (Heroine)
  • సునీల్ రెడ్డి , చాందిని తదితరులు.. (Cast)
  • ఇలాంగో రామ్ (Director)
  • కార్తికేయన్ సంతానం - హర్మాన్ భవేజా - హిరణ్య పెరెరా (Producer)
  • అరుణ్ రాజ్ (Music)
  • సత్య తిలకం (Cinematography)
  • Release Date : మార్చ్ 14, 2025

గత నెల తమిళంలో విడుదలై చాలామందిని షాక్ కి గురి చేసిన సినిమా “పెరుసు” (Perusu). సింహళ భాషలో “టెంటిగో”గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే దర్శకుడు తమిళంలో పెరుసుగా రీమేక్ చేశాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఈ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే.. టీజర్ & ట్రైలర్ కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో నిండిపోవడంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. అయితే.. సినిమా తమిళనాట విడుదలయ్యాక మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే.. గతవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. “ఇదేం కాన్సెప్ట్ రా బాబు?!” అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ ఆశ్చర్యపరిచిన కాన్సెప్ట్ ఏమిటి? నెటిజన్లు ఎందుకు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు? అనేది చూద్దాం..!!

Perusu Review

కథ: ఓ కుటుంబంలో ఓ పెద్ద మనిషి అకస్మాత్తుగా మరణిస్తాడు. అయితే.. ఆ పెద్దాయన పురుషాంగం మాత్రం స్తంభించి ఉంటుంది. దాంతో.. ఆ అంగస్తంభనను కొడుకులు దురై (వైభవ్), సామి (సునీల్ రెడ్డి) ఎలా కవర్ చేశారు? అందుకోసం వాళ్లు పడిన కష్టాలు ఏమిటి? ఈ విషయంలో కుటుంబ సభ్యులైన తల్లి (ధనం), దురై భార్య శాంతి (నిహారిక ఎన్.ఎం), సామి భార్య తులసి (చాందిని) ఏ విధంగా సహకరించారు? అనేది “పెరుసు” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలోని ప్రతి ఆర్టిస్ట్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. తాగుబోతు కొడుకుగా వైభవ్, బాధ్యతగల కుమారుడిగా సునీల్ రెడ్డి, కోడళ్ళుగా నిహారిక, చాందిని, తల్లిగా ధనం, స్నేహితుడిగా బాల శరవణన్ లు పాత్రలో ఒదిగిపోయారు. కామెడీ చేస్తూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడం, ఎమోషన్ ను పండించడం అనేది చాలా కష్టమైన పని, ఆ విషయంలో వైభవ్ & సునీల్ రెడ్డిలను మెచ్చుకోవాలి. కారులో తండ్రి గురించి మాట్లాడుకుంటూ ఏడ్చే సన్నివేశంలో వాళ్ల నటన కచ్చితంగా అందరికీ రిలేటబుల్ గా ఉంటుంది.

ఇక రెడిన్ కింగ్ల్సే, విటివి గణేష్, సుభద్ర రాబర్ట్, దీప శంకర్ తదితరులు మంచి కామెడీ టైమింగ్ తో అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ఇంత బోల్డ్ కాన్సెప్ట్ ను ఏమాత్రం అసభ్యత లేకుండా తెరకెక్కించినందుకు దర్శకుడు ఇలాంగో రామ్ ను మెచ్చుకోవాలి. ఆల్రెడీ సింహళ భాషలో తెరకెక్కించిన చిత్రాన్ని అంతే చక్కగా తమిళంలో రీమేక్ చేయడం, సరైన క్యాస్టింగ్ ను సెట్ చేసుకోవడం వంటి విషయాల్లో అతను చూపిన చొరవ సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా.. సినిమా మొత్తం తిరిగేది పురుషాంగ స్తంభన మీద అయినప్పటికీ.. సదరు షాట్స్ ను ఇబ్బందికరంగా కాక ఫన్నీగా ఫ్రేమ్ చేసిన విధానం బాగుంది.

ఆ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మరీ ఎక్కువగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేకుండా చూడొచ్చు. కచ్చితంగా కుటుంబంలోని అందరూ కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త ఎక్కువయ్యాయి అనిపించినప్పటికీ.. అవన్నీ సందర్భోచితంగా వచ్చేవే కావడంతో మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టవు. అలాగే.. సినిమాని ముగించిన విధానం నవ్విస్తూనే, ఆలోచింపజేస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది, మ్యూజిక్ కూడా బాగుంది. అన్నిటికీ మించి ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ కాన్సెప్ట్ ను చక్కగా ఎలివేట్ చేశాయి.

విశ్లేషణ: ఒక బోల్డ్ పాయింట్ ను అసభ్యకరంగా కాక, హాస్యాస్పదంగా తెరకెక్కిస్తూ.. సెటైరికల్ కామెడీ రన్ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. దాదాపు 20 మంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఈ కాన్సెప్ట్ ను డీసెంట్ గా డీల్ చేయడమే కాక, హృద్యంగా ముగించిన విధానం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. డార్క్ హ్యూమర్ సినిమాలు ఇప్పుడిప్పుడే సౌత్ లో పెరుగుతున్నాయి. వాటికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది, ఈ విధంగా శృతి మించని డార్క్ కామెడీ సినిమాలు మరిన్ని వస్తే ఆడియన్స్ కి కూడా ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. సో, డార్క్ కామెడీ సినిమాలు చూడాలనుకునే వాళ్లు “పెరుసు” చిత్రాన్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే.

ఫోకస్ పాయింట్: డార్క్ హ్యూమర్ జోనర్ కి ఊతమిచ్చిన పెరుసు!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus