ప్లే బ్యాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు రూపమే “ప్లే బ్యాక్”. సుకుమార్ వద్ద పలు చిత్రాలకు వర్క్ చేసిన హరిప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రం గత రెండేళ్లుగా విడుదల కోసం నానా ఇబ్బందులూ పడి ఎట్టకేలకు ఇవాళ (మార్చి 5) థియేటర్లలో విడుదలైంది. “హుషారు” ఫేమ్ దినేష్ తేజ్, “మల్లేశం” ఫేమ్ అనన్య కీలకపాత్రలు పోషించిన ఈ స్కి-ఫై థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

 

కథ: ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న సుజాత (అనన్య), ఓ మీడియా చానల్లో రిపోర్టర్ గా వర్క్ చేస్తున్న కార్తీక్ (దినేష్ తేజ్) ఓ ఫోన్ కాల్ తో వర్చువల్ గా కలుసుకొంటారు. రెండుమూడు రోజులు మాట్లాడుకున్నాక తెలుస్తుంది సుజాత ఉన్నది 1993లో, కార్తీక్ బ్రతుకుతున్నది 2019లో అని. ఈ 26 ఏళ్ల గ్యాప్ కి, టెలిఫోన్ కనెక్షన్ కి సంబంధం ఏమిటి? ఇంతకీ సుజాత-కార్తీక్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రస్తుతంలో ఉన్న కార్తీక్ ఫోన్ ద్వారా గతంలో సుజాత భవిష్యత్ ను ఎలా మార్చాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ప్లే బ్యాక్”.

 

నటీనటుల పనితీరు: దినేష్ తేజ్, అనన్యలకు ఇది రెండో సినిమా కావడంతో కెమెరా ఫియర్ అనేది పెద్దగా కనిపించలేదు. దినేష్ ఎమోషన్స్ విషయంలో పరిణితి చెందాల్సి ఉండగా.. అనన్య హావభావాలపై పట్టు సాధించాల్సి ఉంది.

న్యూస్ ప్రెజంటర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన మూర్తి ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. ఆయన మొఖంలో ఎక్స్ ప్రెషన్ వెతుక్కోవడానికి టైమ్ పడుతుంది కానీ.. డైలాగ్ డెలివరీ మాత్రం బాగుంది. టి.ఎన్.ఆర్ కి డైలాగులు లేకపోయినా స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. అర్జున్ కళ్యాణ్, స్పందన పల్లి, అశోక్ వర్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతికవర్గం పనితీరు: కమ్రాన్ నేపద్య సంగీతం ఈ సినిమాకి ఒన్నాఫ్ ది ప్లస్ పాయింట్. పాటలు లేకపోవడం మరో ప్లస్ పాయింట్ అనుకోండి. బుజ్జి.కె సినిమాటోగ్రఫీ బడ్జెట్ కు తగ్గట్లుగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు. ఒక సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ కు ఉండాల్సిన స్థాయిలో ఆర్ట్ వర్క్ కనబడలేదు. అర్జున్ కళ్యాణ్ పట్టుకొనే కెమెరా, అతనికి హీరోయిన్ ఇచ్చే క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్ మినహా సినిమా మొత్తంలో 1993 టైంలైన్ ను కాస్త అథెంటిక్ గా చూపించే పయత్నం చేయలేదు.

దర్శకుడు రాసుకున్న కథ పలు హాలీవుడ్, కొరియన్ సినిమాల నుంచి స్పూర్తి పొందినప్పటికీ.. కథనం విషయంలో వేగం లోపించింది. కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాడు. అయితే.. తెలుగులో ఇలాంటి కొత్త తరహా సినిమా తీయాలనే ఆలోచనను మాత్రం ప్రశంసించాల్సిందే. అయితే.. కథకుడిగా తాను రాసుకున్న కథను ప్రేక్షకులకు కన్విన్సింగా చెప్పడం కోసం మరీ ఎక్కువగా సింప్లిఫై చేసేశాడు. కాంప్లికేటెడ్ అంశాన్ని సింప్లిఫై చేయడంలో తప్పులేదు కానీ.. అవతార్ సినిమాను జబర్దస్ట్ స్కిట్ లా ప్రెజంట్ చేసినట్లుగా సైన్స్ ఫిక్షన్ ను కేవలం ఒక ఫోన్, పేపర్ మీద చిన్నపాటి వివరణతో ముగించేయడం మింగుడుపడడం కాస్త కష్టం.

 

విశ్లేషణ: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి ఉన్న ప్రేక్షకులకు “ప్లే బ్యాక్” పెద్దగా నచ్చదు. చూడని వాళ్ళకు ఓ మోస్తరుగా ఎక్కుతుంది. ఇంకాస్త బెటర్ ఎగ్జిక్యూషన్, క్యాస్టింగ్ & ప్రొడక్షన్ డిజైన్ ఉండుంటే సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అవ్వడమే కాదు.. మంచి హిట్ గా నిలిచేది కూడా. ఆ అంశాలన్నీ లోపించడంతో ఓ మంచి ప్రయత్నంగా మాత్రమే మిగిలిపోయింది.

 

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus