హీరో, హీరోయిన్ల పై ప్రేక్షకులకు ఉండే అభిమానం.. ఒక్కోసారి హద్దులు దాటేస్తూ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆటోగ్రాఫ్ లు, ఫొటోగ్రాఫ్ లు అంటూ వెళ్లి హీరో, హీరోయిన్ల పై పడిపోవడం వాళ్ళను కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. ముఖ్యంగా హీరోయిన్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇద్దరు అభిమానులు సెల్ఫీ కోసం ఏకంగా తమ అభిమాన హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోయి ఆమెకు షాకిచ్చారట.
వాళ్ళు కంగారు పెట్టిన హీరోయిన్ మరెవరో కాదు ‘ఫ్యాషన్’ ‘హీరోయిన్’ ‘ఐయారి’ ‘బబ్లూ బ్యాచిలర్’ వంటి సినిమాల్లో నటించిన పూజా చోప్రా. ఈ విషయం గురించి ఇటీవల ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. పూజా చోప్రా మాట్లాడుతూ.. “2 నెలల క్రితం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నా కారుని ఫాలో అవుతూ మా ఇంటి వరకూ వచ్చేసారు.తర్వాత మా ఇంటి తలుపులు కొడుతూ నా పేరుతో పిలవడం మొదలుపెట్టారు. తీరా తలుపు తీశాక ఆటోగ్రాఫ్, సెల్ఫీ అంటూ నన్ను కంగారు పెట్టారు.
వాళ్ళు అవి అడిగినందుకు నాకు ఏమీ ఇబ్బంది లేదు. కానీ నా ఇల్లు కనుక్కుని మరీ వచ్చేసి ఇలా అడగడం నన్ను భయాందోళనకు గురి చేసింది.తర్వాత సెక్యూరిటీని ఆరాతీస్తే ‘నాకు తెలీదు’ అన్నాడు. దాంతో నేను అతన్ని తిట్టాను. అటు తరువాత సీసీ కెమెరాల్లో చూస్తే.. వాళ్ళు నా కారుని ఫాలో అవుతూ అపార్ట్మెంట్ లోపలి వరకూ వచ్చినట్లు తెలిసింది. ఆ సంఘటన నన్ను చాలా భయపెట్టింది” అంటూ చెప్పుకొచ్చింది.