సినీ పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉందని హాలీవుడ్ లో మొదలైన ప్రకంపన బాలీవుడ్ మీదుగా టాలీవుడ్ లోకి వచ్చింది. మాధవి లతా, శ్రీ రెడ్డి వంటి వారు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని మీడియా ముందు ధైర్యంగా చెప్పారు. శ్రీ రెడ్డి పేర్లను, ఫోటోలను కూడా బయటపెడుతూ టాలీవుడ్ ని కుదిపేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని చెప్పగా.. మరికొంతమంది మాత్రం శ్రీ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా డీజే బ్యూటీ, జిగేల్ రాణి పూజా హెగ్డే లైంగిక వేధింపులపై సమరశంఖం పూరించింది. ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడింది.
“నాకు ఇంతవరకు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదురుకాలేదు. కానీ, వాటిని ఎదుర్కొన్నవారు తమ అనుభవాలను చెబుతుంటే చాలా బాధ కలుగుతోంది. డబ్బు సంపాదన కోసం.. నటన మీద ఇష్టంతో… ఇలా అనేక కారణాలతో ఈ రంగంలోకి వస్తుంటారు. అలాంటివారిని వేధింపులకు గురి చేయడం దారుణం” అని చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ “లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలి. ఇది ఏ ఒక్కరో చేసే పోరాటం కాదు. అయితే అందరూ కలసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందరూ కలసి పోరాడకపోతే… ఈ వేధింపులు కేవలం వార్తలకే పరిమితమవుతాయి” అని అభిప్రాయం వ్యక్తం చేసింది.