జమ్మూ – కాశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. దీంతో పాకిస్తాన్ పై ఇండియన్స్ రగిలిపోతున్నారు. ‘వాళ్లకు బుద్ధి చెప్పాలని.. సర్జికల్ స్ట్రైక్ ను మళ్ళీ ఆహ్వానించాలని’ సోషల్ మీడియాలో అంతా అభిప్రాయపడ్డారు. ఈ సెగ ప్రభాస్ (Prabhas) ‘ఫౌజీ’ సినిమా వరకు పాకింది. ఇందులో నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వి (Imanvi).. ఓ పాకిస్తాన్ అని, అక్కడి మిలిటెంట్ కూతురని’ ప్రచారం జరిగిన నేపథ్యంలో.. ఇండియన్ సినిమా నుండి వెంటనే ఆ పాకిస్తానీ అమ్మాయిని తీసేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇమాన్వి తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇమాన్వి ఈ లెటర్ ద్వారా స్పందిస్తూ.. “నేను ఇలాంటి వయొలెన్స్ ను, ఘోరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో మరణించిన వారికి నా ప్రగాఢ సానుభూతి చెప్పుకుంటున్నాను. నా ఐడెంటిటీ మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. పాకిస్తాన్ నాకు ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకు కూడా పాకిస్తాన్ మిలటరీ సంబంధం లేదు.
సోషల్ మీడియాని, మీడియాని అడ్డం పెట్టుకుని నాపై విషం చల్లాలని చూస్తున్నారు. కనీసం మీడియాలో ఉన్న జర్నలిస్టులు కూడా సరిగ్గా ఆరా తీయకుండా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య ప్రచారాన్ని ప్రచురించడం బాధాకరం. ఇక నా గురించి చెప్పాలంటే… నేను ఒక ఇండో అమెరికన్ ని. హిందీ, తెలుగు, గుజరాతి, ఇంగ్లీష్ వంటి భాషలు మాట్లాడగలను. నేను అమెరికాలో ఉన్న లాస్ ఏంజిల్స్ లో జన్మించాను. యంగ్ ఏజ్లోనే మా పేరెంట్స్ కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళు అమెరికన్ సిటిజన్స్. నా విద్యాభ్యాసం అంతా అమెరికాలో జరిగింది.కొరియోగ్రాఫర్ గా నా కెరీర్ ప్రారంభించాను.
తర్వాత నాకు ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నాపై ఇండియన్ సినిమాల ప్రభావం గట్టిగానే ఉంది. నాలో ఉన్న ఇండియన్ సంస్కృతిని మతం, ప్రాంతం పేర్లు చెప్పి దూరం చేయకండి. ఐక్యతకు మారు రూపం కావాలని నేను భావిస్తున్నాను. మనం ప్రేమను మాత్రమే పంచాల్సిన సమయం ఇది. చరిత్రలో ఏ విషయం పై అవగాహన కల్పించాలన్నా కళనే ఉపయోగించారు. నాలో ఉన్న కళను ప్రపంచానికి పరిచయం చేయాలని కష్టపడి పనిచేస్తున్నాను. దయచేసి అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.