ప్రభాస్ పుట్టినరోజుకు వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తున్నాయి. కానీ, వీటన్నింటికంటే ఎక్కువ బజ్ ఇప్పుడు హను రాఘవపూడి ఫౌజీ ప్రాజెక్ట్ మీదే నడుస్తోంది. రిలీజ్ చేసిన ఒక్క కాన్సెప్ట్ పోస్టర్, ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీసింది. ఇది ప్రభాస్ చేస్తున్న మిగతా యాక్షన్ చిత్రాల్లా కాదని ఆ పోస్టర్ బలంగా చెబుతోంది.
ఈ సినిమా కాన్సెప్ట్ ట్యాగ్‌లైన్ “ఒంటరిగా పోరాడే సైన్యం”. ఇది వినడానికే చాలా భిన్నంగా ఉంది. అలాగే పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు అంటూ ఒక శ్లోకంలో క్లారిటీ ఇచ్చారు. కర్ణుడు అంటేనే.. మంచివాడైనా, చెడ్డ పక్షాన (కౌరవుల వైపు) నిలబడిన ఓ విషాద యోధుడు. అలాంటిది, ఆ కర్ణుడే పాండవుల (మంచి) వైపు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఊహే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఇక అలాంటి సోల్ తో 1940ల నాటి బ్రిటిష్ బ్యాక్‌డ్రాప్‌లో, ఈ ఇంటెన్స్ కాన్సెప్ట్‌ను హను ఎలా ప్రజెంట్ చేస్తాడోనన్న క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంది. ’సలార్’, ‘కల్కి’ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత, ప్రభాస్ ఇలాంటి ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. హను రాఘవపూడి ‘సీతారామం’తో క్లాసిక్ కొట్టినా, ఆయన బలం సున్నితమైన భావోద్వేగాలు, అందమైన విజువల్స్. అలాంటి క్లాస్ డైరెక్టర్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా మాస్ ఇమేజ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నదే అసలు పాయింట్.
’బాహుబలి’లో వీరత్వం, ‘సలార్’లో రౌద్రం చూపించిన ప్రభాస్, ఈసారి ‘కర్ణుడి’ పాత్రలోని అంతర్గత సంఘర్షణ, త్యాగం చూపించబోతున్నాడని టాక్. “ఒంటరిగా పోరాడిన బెటాలియన్” అనే ట్యాగ్ లైన్ బట్టి, ఇది కేవలం యాక్షన్ స్పై థ్రిల్లర్ మాత్రమే కాదు, ఓ యోధుడి ఎమోషనల్ జర్నీ అని అర్థమవుతోంది.
ఫ్యాన్స్ ఎప్పటినుంచో మిస్ అవుతున్న ‘యాక్టర్‘ ప్రభాస్‌ను ఈ సినిమా తిరిగి తెస్తుందని నమ్ముతున్నారు. అలాగే హను రాఘవపూడికి ఇది తొలి పాన్ ఇండియా పరీక్ష. ‘సీతారామం‘ బడ్జెట్‌కు, ఫౌజీ సినిమా బడ్జెట్‌కు పోలికే లేదు. ఇంత పెద్ద స్టార్‌తో, ఇంత భారీ కాన్సెప్ట్‌ను ఆయన డీల్ చేయడం సవాలే. కానీ, ఈ ప్రయోగం సక్సెస్ అయితే, ఇది కేవలం వెయ్యి కోట్ల సినిమాగా మిగలదు.. ప్రభాస్ కెరీర్‌లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచిపోతుంది.