అసలే తెలుగులో బయోపిక్ లు రావడమే చాలా అరుదు అనుకుంటే.. సదరు బయోపిక్కుల్లో నటించడానికి పరభాషా నటులను వెతుక్కోవాల్సి రావడం అనేది ఇంకా బాధాకరం. తెలుగు వ్యక్తి అయిన శ్రీకాంత్ బొల్లా బయోగ్రఫీని హిందీలో తీసేంతవరకు మనోళ్లు ఎవరూ చప్పుడు చేయలేదు. ఇప్పుడు తాజాగా బయటికి వచ్చిన “గుమ్మడి నర్సయ్య” సినిమా పరిస్థితి కూడా అంతే. తెలుగు రాష్ట్రాల్లో కనీస స్థాయి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు “గుమ్మడి నర్సయ్య”.
సీపీఐ నేతగా, ఎమ్మెల్యేగా, ప్రజా నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన ఆయన జీవితం ఓ పాఠ్యాంశం. అటువంటి గొప్ప వ్యక్తి బయోపిక్ లో నటించడానికి తెలుగు నటులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ను తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. అందులో తప్పేమీ లేదు కానీ.. ఒక తెలుగోడి బయోపిక్ కోసం ఇలా కన్నడ నటుడిని తీసుకురావడమే కాస్త వింతగా అనిపించింది.
గతంలో “యాత్ర, యాత్ర 2” బయోపిక్ లో రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి, జగన్ గా జీవా వంటి పరభాషా నటులు నటించారంటే.. అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. మనవాళ్లు నటిస్తే వాళ్లని టార్గెట్ చేసే పరిస్థితులు ఉండొచ్చు. అందువల్ల ఆ సినిమాల విషయంలో ఇలాంటి డిస్కషన్లు ఎప్పుడూ తలెత్తలేదు. కానీ.. గుమ్మడి నర్సయ్య ఏమైనా కాంట్రవర్సియల్ పొలిటీషియనా.. ఆ పాత్రలో నటిస్తే మిగతా పార్టీ వాళ్లు టార్గెట్ చేయడానికి అంటే కాదు.
కనీసం ఆయనకి రాజకీయ ప్రత్యర్థులు కూడా లేరు. అటువంటి నిజాయితీపరుడైన రాజకీయ ప్రజా నాయకుడి బయోపిక్ లో నటించడానికి మన తెలుగు తారలు ముందుకు రాకపోవడం అనేది చర్చించాల్సిన విషయం. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే.. భవిష్యత్తులో మన తెలుగు తారల బయోపిక్ లకి కూడా పరభాషా నటులను ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ కి ఎప్పడు ఎండ్ పలుకుతారో చూడాలి.