“బాహుబలి”లో నటించినందుకు నేను గర్వపడట్లేదు! – ప్రభాస్

మన తెలుగు సినిమాల గురించి పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకోవడమే చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ప్రపంచం మొత్తం “తెలుగు సినిమా” వైపు తోoగి చూసేలా చేసిన సినిమా “బాహుబలి”. గత రెండేళ్లుగా అందర్నీ ఊరిస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదలకు సరిగ్గా 11 రోజులుంది. సినిమా విడుదల కంటే.. “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్నకు సమాధానం కోసమే జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినా.. సినిమా విశేషాలను మనతో పంచుకొన్నారు చిత్ర కథానాయకుడు ప్రభాస్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!

అదో పెద్ద ప్రశ్న.. “బాహుబలి” రిలీజ్ అయ్యాక.. సినిమా హిట్ అయ్యింది, కలెక్షన్స్ కొల్లగొడుతుంది అనే విషయం పక్కన పెడితే, అసలు సగం సినిమా ఇంత పెద్ద హిట్ ఎలా అయ్యింది?, సినిమాలో సమాధానం చెప్పని ప్రశ్నలు ఓ పది ఉన్నాయి కదా.. వాటికి సమాధానం చెప్పకుండా సినిమాని ముగించి కూడా ఆడియన్స్ ని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అని వినాయక్ గారు నాకు ఫోన్ చేసి అడిగేవరకూ అసలు సినిమాలో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయా అని నాకే అనిపించింది. అయినా ఇంత పెద్ద హిట్ ఎలా అయ్యిందో నాకు కూడా డౌటే.

అసలు రెండు పార్ట్శ్ ఆలోచన మొదట్లో లేదు.. రాజమౌళి “బాహుబలి” కథ చెబుతున్నప్పుడు.. ఇంత పెద్ద కథని రెండున్నర గంటల్లో చెప్పగలమా అనే ఆలోచన వచ్చింది. అయితే.. షూటింగ్ మొదలయ్యాక కానీ మాకు క్లారిటీ రాలేదు. ఇంత మంది రేయింబగళ్ళు శ్రమించి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని రెండున్నర గంటలతో ముగించడం సరికాదు అని భావించి.. అప్పుడు రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని ప్లాన్ చేశాం. అయితే.. రెండు సంవత్సరాల గ్యాప్ మాత్రం కావాలని తీసుకొన్నది కాదు (నవ్వుతూ..)

అమరేంద్రుడితో అంత ఈజీ కాదు.. సినిమా పోషించిన రెండు పాత్రల్లో కష్టమైనది ఏదీ అంటే.. మరో ఆలోచన లేకుండా నేను చెప్పే సమాధానం “అమరేంద్ర బాహుబలి”. ఎందుకంటే.. శివుడు పాత్ర చాలా సరదాగా ఉంటుంది. నచ్చిన పని చేసుకుంటూ పోతుంటాడు. అమ్మాయి కోసం కొండ ఎక్కేస్తాడు, అదే అమ్మాయి కోరిందని రాజ్యాన్నే ఎదిరించి తన తల్లి అని తెలియని ఒక మహిళను కాపాడి మాహిష్మతి నుంచి తీసుకొచ్చేస్తాడు. కానీ.. అమరేంద్రుడి పాత్ర అలా కాదు, నిబద్ధతగా ఉండాలి, వ్యవహార శైలి మొదలుకొని ఆహార్యం వరకూ ప్రతీదాంట్లోనూ రాజరికం ఉట్టిపడాలి. సో, శివుడి పాత్ర కంటే అమరేంద్ర బాహుబలి పాత్ర కోసమే ఎక్కువ కష్టపడ్డాను.

బాహుబలికి ముందు రాజమౌళి ఎనిమిది కథలు చెప్పాడు.. “మిర్చి” తర్వాత రాజమౌళీతో సినిమా అని ఫిక్సయ్యాక.. రాజమౌళి ఒక ఎనిమిది కథలు చెప్పాడు. వాటిలో నాకు బాగా నచ్చింది “శ్రీకృష్ణదేవరాయులు” కథ. రాజు అవ్వడానికి ముందు కృష్ణదేవరాయులు కథను సినిమాగా తీద్దామనుకొని దాదాపుగా ఫిక్స్ అయిపోయాం. కానీ.. ఇంకా బాగుండాలి అని “బాహుబలి” ఫిక్స్ చేశాం.

ఆ ఒక్కటీ అడక్కండి.. సినిమా రిలీజైన తర్వాత నుంచి ఎక్కడికెళ్లినా ఒకటే ప్రశ్న “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?”. నా క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి.. రిలేటివ్స్, డైరెక్టర్స్, కో ఆర్టిస్ట్స్ అందరూ అదే ప్రశ్న. “సినిమాలో చూడండయ్యా బాబూ” అని చెప్పి తప్పించుకొనేవాడ్ని. ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో చెప్పగలిగినది కాదు.. సినిమా ఈ ప్రశ్నకు సమాధానం ఒక 20-30 సన్నివేశాలతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. నాకైతే రాజమౌళి సమాధానం చెప్పినప్పుడు “చాలా ఎగ్జయిట్ అయ్యాను”. ప్రేక్షకులు కూడా అదే తరహాలో ఎగ్జయిట్ అవుతారని ఆశిస్తున్నాను.

హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మించిపోయాం అనిపించింది.. సినిమా మొత్తానికి నేను బాగా కనెక్ట్ అయ్యింది ఫస్ట్ పార్ట్ లోని “వాటర్ ఫాల్ సీక్వెన్స్”కి. అసలు రాజమౌళి చెప్తున్నప్పుడే నేను ఎక్కడికో వెళ్లిపోయాను. అలాంటిది విజువల్ గా చూసినప్పుడు మాత్రం “హాలీవుడ్ సినిమాల కంటే మనదే బాగుంది” అని ఫిక్స్ అయిపోయా. అసలా మబ్బుల నుంచి జలపాతాన్ని ఇప్పుడు సినిమాలో చూసినా ఏదో అద్భుత ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

అప్పుడున్నంత టెన్షన్ మాత్రం లేదు.. ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైమ్ లో ఉన్నంత టెన్షన్ ఇప్పుడు లేదు. అప్పుడంటే.. ఏదో తీశాం, అది కూడా సాగమే చూపిస్తున్నాం. జనాలు ఎలా రిసీవ్ చేసుకొంటారో అని తెగ భయపడ్డాం. కానీ.. ఇప్పుడలా కాదు సినిమా కోసం జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మీడియా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అసలు బాలీవుడ్ మీడియా మాకు సపోర్ట్ చేస్తున్న విధానానికి మేమే షాక్ అయ్యాం.

కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే.. నిర్మాతలు సినిమా కోసం కంటే.. ప్రమోషన్ కోసం విపరీతంగా ఖర్చు చేశారు. ఫస్ట్ పార్ట్ అంత పెద్ద హిట్ అయినా.. నిర్మాతలకు పెద్దగా మిగిలిందేమీ లేదు. సో, ఇప్పుడు సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప నిర్మాతలకు లాభాలు రావు. కాబట్టి “బాహుబలి” బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే.

300 రోజులు యాక్షన్ సీన్లే తీశాం.. సినిమా షూటింగ్ ఒక మూడేళ్లు తీస్తే.. అందులో రెండేళ్లు కేవలం యాక్షన్ సీక్వెన్స్ లే తీశాం. వార్ సీన్స్ కోసం నేను స్వయంగా షూటింగ్ లో పాల్గొంది 300 రోజులు. అసలు 300 రోజులపాటు యాక్షన్ సీక్వెన్స్ లో యాక్ట్ చేయడం అంటే ఏదో రోజూ స్కూల్ కి వెళ్తున్నట్లు అనిపించేది. నిజానికి.. స్కూల్ డేస్ కంటే బాహుబలి షూటింగ్ డేస్ నే నేను ఎక్కువగా ఎంజాయ్ చేశాను.

సహనం అప్పుడు నేర్చుకొన్నాను.. “బాహుబలి” కోసం అయిదేళ్లు వెచ్చించారు కదా మీకు అంత ఓపిక ఎలా వచ్చింది?” అని చాలా మంది అడిగారు. సినిమా అనేది నాకు ఫ్యాషన్ సో నాకు నచ్చిన పని కోసం అన్నేళ్లు వెయిట్ చేయడం పెద్ద విశేషం ఏమీ కాదు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారు మొగల్తూరు తీసుకెళ్లి.. “ఒక నెలరోజులపాటు ఈ ఊర్లో సమస్యలన్నీ నువ్వే చూసుకోవాలి” అని ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అసలేం చేయాలో తెలీదు. ఎవరితో మాట్లాడాలో తెలీదు. వాళ్ళు చెప్పిన సమస్యలను ఎలా తీర్చారో అసలు ఐడియా లేదు. అలాంటి పరిస్థితిని అధిగమించినప్పుడే “ఓపిక, సహనం”లాంటివి అలవాటయ్యాయి.

రాజమౌళి తెగ ఎగ్జయిట్ చేసేవాడు.. అసలు రాజమౌళీతో పని చేయేడమే ఒక అద్భుతం. ఆయన సన్నివేశాన్ని వివరించే విధానం, మా నుంచి సన్నివేశానికి తగ్గట్లు నటనను రాబట్టుకొనే తీరు, అందరితోనూ కలివిడిగా మెలిగే వ్యక్తిత్వం మమ్మల్ని ఆయన మాయలో నుంచి బయటకు రానీకుండా చేసేది. అసలు కొన్ని సీన్లు చెప్పేప్పుడు రాజమౌళి తాను ఎగ్జయిట్ అవ్వడంతోపాటు మమ్మల్ని కూడా విపరీతంగా ఎగ్జయిట్ చేసేవాడు. ఇప్పుడవన్నీ తలచుకొంటే ఫన్నీగా అనిపిస్తుంది.

లేట్ గా రావాలన్న ఆలోచన కూడా వచ్చేది కాదు.. ఒక్కోరోజు షూటింగ్ అర్ధరాత్రి వరకూ జరిగేది, నెక్స్ట్ డే లేట్ గా వెళ్లొచ్చు కదా అన్న ఆలోచన వచ్చేది, లేట్ గా వచ్చినా అక్కడ అడిగేవాళ్లు కూడా లేరు. కానీ.. మనసులో ఎక్కడో తెలీని ఇబ్బంది. ఇంతమంది కష్టపడుతున్నప్పుడు మనం లేట్ గా వెళ్ళడం ఎంతవరకూ సబబు అనిపించేది. అందుకే షూటింగ్ మొత్తంలో ఎప్పుడో దెబ్బలు తగిలితే తప్ప ఒక్కరోజు కూడా లేట్ గా వెళ్ళడం కానీ.. షూటింగ్ కి డుమ్మా కొట్టడం లాంటివి చేయలేదు.

100లో 60 పేజీలు “బాహుబలి”వే..నా జీవితం చివర్లో నా గురించి, నా సినిమాల గురించి ఒక పుస్తకం రాయాలనుకొంటే.. ఒక 100 పేజీలు రాస్తే, అందులో 60 పేజీలు బాహుబలి గురించే ఉంటాయి. ఒక నటుడిగానే కాక ఒక వ్యక్తిగానూ “బాహుబలి” సినిమా నాపై చూపిన ప్రభావమది.

నేనెందుకు గర్వపడాలి.. “సినిమాలో నటించినందుకు గర్వంగా ఉందా?” అని ఈమధ్య మీడియా ఇంటర్వ్యూల్లో అడుగుతున్నారు. అసలు ఆ సినిమాలో నటించినందుకు నేనెందుకు గర్వపడాలి చెప్పండి. కథ నేను రాయలేదు, సినిమా నేను తీయలేదు. కేవలం నటించాను, అది కూడా దర్శకుడు ఎలా చేయాలో చెప్తే, అతను చెప్పినట్లు చేసుకుంటూపోయాను. సో, ఈ సినిమాని నేను బాధ్యతగా భావించాను తప్పితే.. ఎప్పూడూ గర్వపడలేదు, పడను కూడా.

బాహుబలి తర్వాత అన్నాను కానీ.. ఈ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్న కంటే నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న “పెళ్లెప్పుడు?”. తమిళ మీడియా కూడా “ఇంతకీ ఎప్పుడు పెళ్లి చేసుకొంటారు?” అని అడిగితే ఏం చెప్పాలో అర్ధం కాక “త్వరలోనే..” అంటూ తప్పించుకొన్నాను. అయితే.. నేను “బాహుబలి” తర్వాత పెళ్లి చేసుకొంటా అని చెప్పానే కానీ.. 2017లోనే పెళ్లి అని చెప్పలేదు. సో, అతి త్వరలోనే ముందు మీడియాకి చెప్పే పెళ్లి చేసుకొంటాను. కానీ.. ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడు అడక్కండి.

ఇంకో మూడు రోజుల్లో క్లారిటీ.. నా నెక్స్ట్ సినిమా గురించి, ఆ సినిమా టైటిల్ గురించి, ఆ తర్వాతి సినిమా గురించి.. ఇలా అన్నీ వివరాలు మరో 2-3 రోజుల్లో మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను. అప్పటివరకూ ఎలాంటి గాసిప్స్ ని నమ్మకుండా “బాహుబలి 2” కోసం వెయిట్ చేయండి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus