Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రియదర్శి (Hero)
  • ఆనంది (Heroine)
  • సుమ కనకాల, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, రాంప్రసాద్ తదితరులు (Cast)
  • నవనీత్ శ్రీరామ్ (Director)
  • జాన్వీ నారంగ్ - పుస్కూర్ రామ్మోహన్ రావు (Producer)
  • లియోన్ జేమ్స్ (Music)
  • విశ్వనాథ్ రెడ్డి (Cinematography)
  • రాఘవేంద్ర తిరున్ (Editor)
  • Release Date : నవంబర్ 21, 2025
  • శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (Banner)

“సారంగపాణి జాతకం, మిత్ర మండలి” చిత్రాలతో కాస్త డల్ అయిన ప్రియదర్శి నటించిన తాజా చిత్రం “ప్రేమంటే”. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమ కనకాల కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Premante Movie Review

కథ: పాయింట్ గా చెప్పాలంటే.. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. విడుదల చేసిన మొదటి పాటలో వచ్చే ఓ లిరిక్ లోనే కథ ఏంటి అనేది చెప్పేశాడు దర్శకుడు.

మది (ప్రియదర్శి) అప్పుల్లో కూరుకుని, డబ్బు సమస్య కారణంగా పెళ్లి ఎవాయిడ్ చేస్తూ వస్తుంటాడు. కానీ.. ఓ పెళ్లిలో కలిసిన రమ్య (ఆనంది)ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లైన నెల రోజులకే మదికి సంబంధించిన ఓ షాకింగ్ విషయం తెలుసుకుంటుంది రమ్య. ఆ మేటర్ వారి వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది? చాయ్ తాగిన తర్వాత మది-రమ్య ఏం డిసైడ్ అయ్యారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ప్రేమంటే” చిత్రం.

నటీనటుల పనితీరు: ప్రియదర్శి, ఆనంది తమ రెగ్యులర్ రోల్స్ కి భిన్నంగా కొత్తగా కనిపించారు. అయితే.. వారి పాత్రలకి ఇచ్చిన ట్విస్ట్ బాగున్నా.. క్యారెక్టర్ ఆర్క్స్ కి సరైన వాలిడేషన్ లేకపోవడంతో.. ప్రారంభ దశలో ఆసక్తికరంగా ఉన్న పాత్రలు.. కొన్ని సన్నివేశాల తర్వాత బోర్ కొడతాయి.

సుమ కనకాల సినిమాలో నటించినట్లుగా కాక ఏదో జబర్దస్త్ స్కిట్ చేసినట్లుగా నటించింది. అందువల్ల ఆమె పాత్ర కానీ.. ఆమె పెర్ఫార్మెన్స్ కానీ అసహజంగా ఉంటాయి.

వెన్నెల కిషోర్ నవ్వించడానికి ప్రయత్నించాడు. హైపర్ ఆది, రాంప్రసాద్ ల పంచులు అవుట్ డేటెడ్ అయిపోవడంతో పెద్దగా నవ్వించలేకపోయాయి.

మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు నవేనీత్ శ్రీరామ్ ఎంచుకున్న కథ బాగుంది. నిజానికి చాలా ఆసక్తికరమైన పాయింట్ అది. కానీ.. ఆ పాయింట్ ను నడిపిన విధానమే అసలు మైనస్. ట్విస్ట్ రివీల్ చేసేవరకూ బాగానే సాగింది కానీ.. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. జోక్ అనేది ఎప్పుడైనా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు నవనీత్ & డైలాగ్ రైటర్ కార్తీక్ కాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. అవసరానికి మించిన ప్రాసలు దొర్లాయి, అసందర్భమైన పంచులు పేలాయి. అవేమీ సినిమాకి ఉపయోగపడలేదు. ముఖ్యంగా.. సినిమాని ముగించిన విధానం లాజికల్ గా కానీ.. ఎమోషనల్ గా కానీ కన్విన్సింగ్ గా లేదు. ఓవరాల్ గా.. దర్శకుడిగా, కథకుడిగా నవనీత్ మెప్పించలేకపోయాడని చెప్పాలి.

విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ నుండి ఇంకాస్త మంచి సపోర్ట్ & ప్రొడ్యూసర్స్ నుంచి ఇంకొంచం బడ్జెట్ వచ్చి ఉంటే బాగుండేది. లియోన్ జేమ్స్ పాటలు రానురాను మొనాటనస్ గా మారిపోతున్నాయి. నేపథ్య సంగీతం కూడా అలరించే స్థాయిలో లేదు.

విశ్లేషణ: పాత కథనైనా కొత్తగా చెప్పాలంటారు.. అలాంటిది ఒక కొత్త పాయింట్ ను ఇంకెంత కొత్తగా చూపించాలి అనేది ప్రతి దర్శకరచయిత ఒకటికిపడిసార్లు ఆలోచించుకోవాల్సిన విషయం. కోర్ పాయింట్ ఎంత బాగున్నా.. దాని చుట్టూ అల్లుకున్న సందర్భాలు పేలవంగా ఉన్నాయంటే మాత్రం సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం అనేది కష్టం. “ప్రేమంటే” విషయంలో జరిగింది అదే. క్రేజీ పాయింట్ ఉంది, మంచి పెర్ఫార్మర్లు ఉన్నారు.. అయితే వాళ్లని సరిగా వినియోగించుకోవడంలో తడబడ్డాడు దర్శకుడు నవనీత్. ముఖ్యంగా హాస్యం పండించడంలో ఇంకాస్త పరిణితి అవసరం.

ఫోకస్ పాయింట్: వికటించిన రాధ దొంగతనం!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus