తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సమయంలో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని అగ్ర హీరోలందరూ తమ సినిమాలను బరిలోకి దించుతుంటారు. భారీ అంచనాలు ఉండే ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తాయని మేకర్స్ భావిస్తారు. గత కొన్నేళ్ళల్లో సంక్రాంతి టైమ్ లో వచ్చిన కొన్ని సినిమాలు ఊహించని ఇబ్బందులు మిక్స్డ్ టాక్ లను ఎదుర్కొంటున్నాయి.
ముఖ్యంగా మొదటగా వచ్చే సినిమాలకు ఒక రకమైన సెంటిమెంట్ వెంటాడుతోంది. 2018లో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే భిన్నాభిప్రాయాలను సొంతం చేసుకుంది. కథలోని లోపాలు సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తరువాత క్రాక్ హిట్టయినా రిలీజ్ టైమ్ లో ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. 2024 సంక్రాంతికి మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ తర్వాత కథాంశం తదితర విషయాల్లో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వల్ల ఇది కేవలం మిక్స్‌డ్ టాక్ కే పరిమితమైంది.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దర్శకుడు శంకర్ తో చరణ్ చేసిన ఈ పొలిటికల్ డ్రామాపై పాన్ ఇండియా లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది. 2025 పండగకు విడుదలైన ఈ చిత్రంలో కథనం సరిగా లేకపోవడం రన్ టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
లేటెస్ట్ గా 2026 సంక్రాంతి బరిలో నిలిచిన ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ పైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ మూవీ డార్లింగ్ ఫ్యాన్స్ ను అలరించినా అందరినీ మెప్పించడంలో మాత్రం తడబడినట్లు కనిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి మొదట్లో వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతిమంగా సినిమా రిజల్ట్ ను కంటెంట్ మాత్రమే నిర్ణయిస్తుంది అని గుర్తుంచుకోవాలి.