సినీ అభిమానులకి, ముఖ్యంగా డాన్స్ తో సంబంధం ఉన్నవారికి పరిచయం లేని పేరు ప్రభుదేవా. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా అభివర్ణించే ప్రభుదేవా నటుడిగా, దర్శకుడిగానూ మెప్పించారు. ఇప్పుడు నిర్మాతగానూ మారిన ప్రభుదేవా అక్టోబర్ 7న ‘అభినేత్రి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్బంగా పాత్రికేయులతో మాట్లాడిన ఆయన తాను మాస్టర్ గా మారిన రోజులని తలచుకుని ఈ విధంగా వివరించారు.బాల్యంలో ప్రభుదేవాకి అసలు చదువు అబ్బేది కాదట. దాంతో తండ్రి నృత్య దర్శకుడైన సుందరం మాస్టర్ షూటింగ్స్ కు కొడుకుని వెంట తీసుకెళ్లేవారట. అలా తండ్రికి సహాయకుడిగా మారిపోయిన ప్రభుని సుందరం మాస్టర్ బిజీగా ఉన్న సమయంలో తీసుకెళ్లి తమ సినిమాల పనులు పూర్తి చేసేవారట కొందరు దర్శకులు. అలా తనకు తెలియకుండానే పద్నాలుగేళ్ల వయసులో మాస్టర్ అయిపోయానని చెప్పారు ఈ డాన్స్ మాస్టర్.
అలా అప్పట్లోనే రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి వారితో పనిచేసినా ఆ సమయంలో వారి స్థాయేంటో తనకు తెలిసేది కాదు గనక అందరితోను చాలా కలివిడిగా ఉండేవాడినని గత రోజులని తలచుకున్నారు. వారు తన వయసుని పక్కన పెట్టి ప్రతిభకు గౌరవం ఇచ్చి బాగా చూసేవారన్న ప్రభు ఎంతోమంది హీరోలు తనకు ఇష్టాంగా వడ్డించేవారని చెప్పారు.ఇప్పటికీ ఎన్ని చేస్తున్నా తృప్తినిచ్చేది డాన్స్ అని మనస్ఫూర్తిగా చెప్పే ఆయన పాట వింటున్నపుడే డాన్స్ వచేస్తుందని దానికోసం ఇప్పటివరకు ప్రత్యేకించి రిహార్సల్స్ చేయలేదని చెప్పారు. డాన్స్ అకాడమీ ఏర్పాటు చేయొచ్చుగా ఆనందానికి స్పందిస్తూ “అకాడమీ పెడితే పూర్తి సమయం దానికే కేటాయించాలి”అని బదులిచ్చింది ప్రభుదేవా డిసెంబర్ లో హిందీలో ఓ సినిమా మొదలవుందని తెలిపారు.