టాప్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకులపై ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రభుదేవా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. ‘ మై డియర్ భూతం ‘ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు ప్రభుదేవా రెడీ అయ్యారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం రైటర్ నందు తుర్లపాటి మాట్లాడుతూ .. ‘రమేష్ అన్న, బాలాజీ అన్న, మా మాస్టార్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక వేళ మీరు ఈ సినిమాను చూడకపోతే ఓ నోస్టాల్జిక్ మూమెంట్‌ను మిస్ అవుతారు. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని అన్నారు.
పాటల రచయిత చల్లా భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు పాటలు రాసే టైంలో నేను యశోద డైలాగ్స్ రాయడంలో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో నందు అన్న ఫోన్ చేసి ‘మై డియర్ భూతం’ గురించి చెప్పారు. ఎప్పుడూ ఇలానే అంటావ్.. బ్రేక్ వచ్చేది చెప్పమని అన్నాను. దీంతో బ్రేక్ వస్తుందని ఆయన అన్నారు. ప్రభుదేవా గారికి పాట రాయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇమ్మాన్ గారి పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మాస్టార్ గారు అద్భుతంగా స్టెప్పులు వేశారు. ఇప్పుడు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను కోరుకుంటున్నారు. అందరినీ థియేటర్లోకి ఆహ్వానించే సినిమా అవుతుంద’ని అన్నారు.
ఏఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘రమేష్ పిళ్లై గారు చేస్తోన్న సినిమాలన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఆయన దాదాపు పది చిత్రాలు చేస్తున్నారు. అవన్నీ కూడా నేనే చేస్తానని అనుకుంటున్నాను. ప్రభుదేవా గారి సినిమాను నేను చేస్తాను అని అనుకోలేదు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా హీరోయిన్ బాగా చేసింది. మా టీం అందరికీ థ్యాంక్స్.’ అన్నారు.
డైరెక్టర్ ఎన్. రాఘవన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు అంతగా రాదు. తప్పులు మాట్లాడితే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ పిళ్లై గారికి థ్యాంక్స్. ఆయనకు వేరే కథ చెప్పడానికి వెళ్లాను. కానీ ఆయన మాత్రం భూతం కథ ఉంది కదా? అది చెప్పమని అడిగారు. నేను ఈ స్క్రిప్ట్‌ను ప్రభుదేవా మాస్టర్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. కానీ ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పలేదు. ఆయనే స్క్రిప్ట్ అంతా చదివి ఈ కథకు ప్రభుదేవా అయితే బాగుంటుందని అన్నారు. నిజంగా ఈ స్క్రిప్ట్‌ని ఆయన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను అని చెప్పాను. వెంటనే ప్రభుదేవా గారితో మాట్లాడారు. సినిమా మొదలైంది. ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం ప్రభుదేవా గారు 45 రోజులు కష్టపడ్డారు. ఆ కష్టం మీకు తెరపై కనిపిస్తుంది’ అని అన్నారు.
రమ్యా నంబీశన్ మాట్లాడుతూ.. ‘మా సినిమా మై డియర్ భూతం జూలై 15న రాబోతోంది. మేం ఎంత కష్టపడ్డామో మీకు తెలుస్తుంది. నాకు తెలుగు తెలియదు. నన్ను క్షమించండి. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. నాకు ప్రభుదేవా గారితో ఇది మూడో సినిమా. ఇంత మంచి టీంతో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘రమేష్ పిళ్లై ఎంతో సక్సెస్‌ఫుల్ నిర్మాత. ఆయన కంపెనీలో చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. తను మా బాలాజీకి ఈ సినిమాను ఇవ్వడం ఆనందంగా ఉంది. నా చెల్లి భాగ్యలక్ష్మీ పాటలు రాసినందుకు సంతోషంగా ఉంది. విక్రమ్, మేజర్ తరువాత ఇండస్ట్రీ స్ట్రగుల్‌లో ఉంది. థియేటర్లకు జనాలు రావడం లేదు. చాలా మంచి సినిమాలు వచ్చినా కూడా జనాలు రావడం లేదు. ఈ ట్రైలర్, సాంగ్స్ చూసిన తరువాత ఒకప్పుడు ప్రేమికుడు అనే సినిమాతో ప్రభుదేవా యూత్‌ని థియేటర్లకు ఎలా లాక్కొచ్చాడో.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తాడనే నమ్మకం నాకుంది. రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం టీం అంతా కూడా చాలా కష్టపడింది. ప్రభుదేవాతో రాఘవన్ ఎలాంటి సినిమాలు చేయాలని అనుకున్నాడో.. అలాంటిదే చేశారు. అల్లావుద్దీన్ దీపం సినిమాతో పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో. మళ్లీ ఇప్పుడు అలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలను ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలని అనుకుంటారు. పైరసీ, ఓటీటీలను ఎంకరేజ్ చేయకండి. జనాల మధ్యలో ఈ సినిమాను చూస్తే ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
ప్రభుదేవా మాట్లాడుతూ.. ‘భాగ్యలక్ష్మీ గారు పాటలు బాగా రాశారు. ఇది నాకు హోం గ్రౌండ్. నన్ను తెలుగు చిత్రపరిశ్రమే పైకి తీసుకొచ్చింది. టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు ప్రభుదేవా స్టేజ్ మీదే స్టెప్పులు వేసి అందరినీ అలరించారు.