సినిమాటిక్ యూనివర్స్.. ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఇదో హాట్ టాపిక్. రెండు పెద్ద సినిమాల నేపథ్యాన్ని, అగ్ర హీరోల పాత్రలను కలిపి ఓ సరికొత్త ప్రపంచాన్ని రూపొందించడం.. అది చూసి ప్రేక్షకులు ఆనందించడం దీని వెనుక ఆలోచన. ఈ క్రమంలో ఇండియన్ సినిమాలో చాలా సినిమాటిక్ యూనివర్స్‌లు సిద్ధమవుతున్నాయి. అందులో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఇంకా ఏ సినిమాలు రాలేదు కదా! అనుకుంటున్నారా?
ఇప్పటివరకు ఆ యూనివర్స్‌లో సినిమాలు అయితే రాలేదు కానీ.. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారట. తనదైన ప్రపంచంలోకి ప్రజల్ని తీసుకెళ్లడానికి గ్రౌండ్ వర్క్ బిల్డ్ చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే ‘కేజీయఫ్’ సినిమాలు, ‘సలార్’ (Salaar) సినిమాలు తీస్తున్నారట. అంతేకాదు తర్వాత చేయబోయే ఎన్టీఆర్ (Jr NTR) సినిమా కూడా అందులోనే ఉంటుంది అంటున్నారు. అయితే ఈ మూడు సినిమాలను కీలకంగా మారేది శివ మన్నార్ అట. ఈ మాట మేం చెప్పడం లేదు.
‘కె.జి.యఫ్’లో (KGF2) నరాచీ, ‘సలార్’లో ఖాన్సార్ నగరాల్ని చూపిస్తూ పాత్రల్ని మలిచారు ప్రశాంత్ నీల్. ఆ ప్రపంచాల్ని, పాత్రల్ని కలుపుతూ తదుపరి సినిమాలు చేసే ఆలోచనలో ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్టు తెలుస్తోంది. ‘సలార్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ విషయాన్ని చూచాయగా చెప్పేశారు. ప్రశాంత్ నీల్ తనకు చెప్పిన కథలన్నింటిలో శివ మన్నార్ పాత్ర అద్భుతంగా ఉందని. ఆ పాత్ర మరొక ప్రపంచంతోనూ ముడిపడి ఉంటుంది అని పృథ్వీరాజ్ చెప్పారు.
దీంతో శివ మన్నార్ పాత్ర ఏ సినిమాలో ఉండే అవకాశాలున్నాయి అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ‘కేజీయఫ్’, ‘సలార్’ సినిమాలతోపాటు ఎన్టీఆర్‌తో చేయబోయే ప్రశాంత్ నీల్ సినిమాలన్నింటిని కలిపి ఓ పెద్ద యూనివర్స్‌ను రూపొందించే క్రమంలో ప్రశాంత్ నీల్ ఉన్నారు అని అంచనా వేస్తున్నారు. అంటే తారక్, యశ్(Yash), ప్రభాస్‌ను ఒక చోట చూడకపోయినా.. వాళ్ల ప్రపంచాల్ని ఒక చోట చూడొచ్చేమో.