మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటీనటులు వీరే అంటూ చాలా రోజులుగా రకరకాల పుకార్లు వస్తున్నాయి. అలా వచ్చిన పుకార్లలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించడం నిజమైంది. ఇంకా టీమ్ చెప్పకపోయినా.. లీక్డ్ ఫొటోల బట్టి, ఆమె సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టుల బట్టి ఆ విషయంలో స్పష్టత వచ్చేసింది. మరో క్లారిటీ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో.
మహేష్ – రాజమౌళి సినిమాను సూపర్ స్టార్ ఫ్యాన్స్ #SSMB29 అంటుంటే.. రాజమౌళి ఫ్యాన్స్ #SSRMB అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఈ సినిమా షూటింగ్ అయితే ఇటీవల ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్కడికి వెళ్లిన నటుల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా ఉన్నాడు. అంటే ఆయన కూడా నటిస్తున్నట్లు తేలిపోయింది. ఆ విషయం పక్కన పెడితే మరోసారి ఆయన ఫ్యాన్స్‌ని, ప్రేక్షకుల్ని, మీడియాని చిన్నసైజ్ మోసం చేశారు అని చెప్పాలి.
అయితే సినిమాల విషయంలో ఇది చాలామంది నటులు చేసేదే. అంతేకాదు గతంలో ఆయన చేసినది కూడా. తన దర్శకత్వంలో రూపొందిన మోహన్ లాల్ (Mohanlal) సినిమా ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan) సినిమా ప్రచారం కోసం వచ్చిన పృథ్వీరాజ్.. రాజమౌళి సినిమా గురించి మాట్లాడాడు. సినిమా చిత్రీకరణ దశలో ఉందని, దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేను అని చెప్పాడు.
అక్కడితో ఆగకుండా నేను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యాను. అప్పటి నుండి ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాం అని పృథ్వీరాజ్ చెప్పాడు. ఇదే ఇప్పుడు కీలకమైన పాయింట్. ఎందుకంటే ఓ నెల క్రితం అనుకుంటా.. రాజమౌళి సినిమా గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ దగ్గర ప్రస్తావిస్తే.. ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు అని చెప్పాడు. అంటే అప్పుడు నిజం చెప్పనట్లే కదా అని అంటున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. గతంలో ‘సలార్’ (Salaar) సినిమా విషయంలోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలానే చెప్పాడు.