పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) 16 ఏళ్ల కష్టం ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’ (The Goat Life) వెండితెర మీదకు వచ్చినప్పుడు మన దగ్గర సరైన స్పందన అందుకోలేదు. అయితే మలయాళ పరిశ్రమ మాత్రం సినిమాను నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? ఈ సినిమా నెక్స్ట్ ఇన్నింగ్స్ అదేనండీ ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో నెల రోజుల్లో సినిమాను ఓటీటీలో చూడొచ్చట. ఈ ఏడాది మలయాళ సినిమాలు బాక్సాఫీసు దగ్గ భారీ విజయం అందుకుంటున్నాయి.
ఏ హీరో చేసినా వరుసగా రూ. 100 కోట్ల వసూళ్లు అందుకుంటూ భారీ విజయాలు నమోదు చేసుకుంటున్నాయి. అలా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మార్చి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ఓటీటీ పార్టనర్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇప్పటికే ఖరారు అయింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అంటూ ఓ తేదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం మే 10న స్ట్రీమింగ్‍కు వస్తుందట. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేరళకు నుండి దుబాయికి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు. దీంతో అక్కడ నుండి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు. అతను స్వదేశానికి చేరుకున్నాడా? మార్గమధ్యంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే సినిమా కథ.
ఈ క్రమంలో ఆయా దేశాలకు వెళ్లిన భారతీయులు ఎలాంటి జీవితాన్ని గడుపుతారన్నది సినిమాలో చూపించారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ దాదాపు 16 ఏళ్లు కష్టపడ్డాడు. మరి ఆ కష్టానికి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.