రాజమౌళి కలల సృష్టి ‘బాహుబలి’ సినిమా చూసి ప్రేక్షకులంతా కళ్ళు ఇంతింతలు చేసుకుని నోరెళ్లబెట్టారు. ఆ విజువల్ వండర్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది ప్రేక్షకుల వంతు. ఇక చిత్రపురిలోని నటీనటులైతే ఈ సినిమాలో ‘మనం లేకుండా పోయామే’ అని కుమిలిపోయారు. కనీసం రెండో భాగంలోనైనా ఓ పాత్ర దక్కితే బాగుణ్ణు అన్న ఆలోచన కూడా ‘కొత్త పాత్రలు ఉండవు’ అని రాజమౌళి అన్న మాటతో అంతమయిపోయింది. సూర్య లాంటి స్టార్ హీరో నోరు తెరిచి అడిగిన దక్కని అవకాశం ఓ హైదరాబాదీ అమ్మాయి వశమైంది.
హైదరాబాద్ కి చెందిన ప్రియా నాయుడు ఈ అద్భుత అవకాశాన్ని చేజిక్కించుకుంది. నగరంలోనే జన్మించిన ప్రియా బెంగళూర్ లో పెరిగింది. ఫాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన ప్రియా పోర్ట్ ఫోలియోని తన కజిన్ చిత్ర బృందానికి పంపారట. ఆడిషన్ కి పిలిచిన తర్వాతి రోజే షూటింగ్ రమ్మని చెప్పడంతో ప్రియా ఆనందం పట్టలేకపోయిందట. ఇంతటితో ఈ కథ ముగిసిందంటే పొరపాటే. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘నక్షత్రం’ సినిమాలోను ఓ ముఖ్య పాత్రలో నటించే అవకాశం కొట్టేసింది ప్రియా. ఆ మాటకొస్తే ప్రియాను ముందు ఆడిషన్ చేసింది కృష్ణవంశీనే. వీటితోపాటు అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ‘హంటర్’ రీమేక్, అడివి శేష్ ;గూడాచారి’ సినిమాల్లోను ఛాన్స్ అందుకుంది ప్రియా. ఇప్పుడు చెప్పండి అదృష్టం అంటే ఈమెదే కదూ..!