తెలుగు రాని అమ్మాయిలు తెలుగు మాట్లాడుతుంటే, మాట్లాడటానికి ట్రై చేస్తుంటే చాలా ముద్దొస్తుంది కదా. ఇప్పుడు అంతే ముద్దు వస్తోంది ప్రముఖ బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో చూస్తుంటే. ‘వారణాసి’ సినిమా ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ కోసం ఆమె ఎలా సిద్ధమయ్యారు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఈవెంట్‌కి ముందు ఏం జరిగింది, ఈ వెంట్‌లో ఏం జరిగింది, ఎలా జరిగింది లాంటి వివరాలను ఆమె ఆ వీడియోలో చూపించారు. అందులో ఓ విషయంలో వైరల్‌గా మారింది.
మహేష్ బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటలీవల జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అందరూ ఊహించినట్లుగానే మహేష్‌తోపాటు ప్రియాంక చోప్రా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దాని కోసం ఆమె ప్రిపరేషన్ చూస్తే ఇంకా స్పెషల్‌గా అనిపిస్తుంది.
ఆ ఈవెంట్‌లో స్టేజీ మీదకు రాయల్ స్టైల్‌లో వచ్చిన ప్రియాంక చోప్రా హలో హైదరాబాద్ అంటూ అభిమానులను పలకరించింది. ఆ తర్వాత తగలబెట్టేద్దామా? అంటూ క్యూట్‌గా చెప్పింది. ఈ డైలాగ్ చెప్పడం కోసం ఆమె ఎంత కష్టపడింది బీటీఎస్ వీడియోలా రూపొందించి సోషల్ మీడియాలో రిలీజ్చేసింది. అందులో ఆమె తెలుగు ప్రాక్టీస్ చూడొచ్చు. సినిమాల్లో కంటే ఆడియన్స్ ముందు తెలుగులో మాట్లాడడం కష్టం అని చెప్పింది. తెలుగులో మాట్లాడడం కోసం ఓ స్పెషల్ డైరీ మెయింటెన్ చేస్తున్నా అని కూడా చెప్పింది.
తెలుగులో ఎన్నో ఏళ్లపాటు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన, అనుభవిస్తున్న హీరోయిన్లు కూడా తెలుగు నేర్చుకుందామని అనుకోని ఈ రోజుల్లో ప్రియాంక చోప్రా ఇలా తెలుగు కోసం ప్రయత్నించడం పెద్ద విషయమే అని చెప్పాలి. ఇక ‘తగలెట్టేద్దామా’ అనే టాలీవుడ్‌లో ఊతపదమని మీకు తెలిసే ఉంటుంది.