‘7/జీ బృందావన్ కాలనీ’, ‘ప్రేమిస్తే’, ‘సైరట్’, ‘బేబీ’.. ఈ సినిమాల పేర్లను ఇలా పక్కపక్కన చూస్తుంటే మీకేమనిపిస్తోంది. ఏంటీ మొత్తం కల్ట్ ప్రేమ కథలన్నీ ఒక దగ్గర రాశారు అనిపిస్తోంది కదా. అవును మీరు అనుకున్నది నిజమే. ఎందుకంటే ఆ సినిమాల సరసన నిలిచేలా ఓ సినిమా తాము సిద్ధం చేశాం అని చెప్పారు యువ దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన ఓ నిర్మాతగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా గురించే ఇదంతా. పై సినిమాల వరుసలోనే మా సినిమా కూడా ఉంటుంది అంటున్నారు.
నిర్మాత రాహుల్ మోపిదేవితో కలసి వేణు ఊడుగుల నిర్మించిన ఈ సినిమాను సాయిలు కంపాటి రూపొందించారు. అఖిల్, తేజస్విని రావ్ జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ తమ సినిమా ఆ ‘కల్ట్’ స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. 5 ఏళ్లుగా సమాధిగా ఉన్న ఓ వాస్తవ ఘటన ఈ సినిమా. ఖమ్మం – వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు సాయిలు ఈ కథని సిద్ధం చేసుకున్నారని చెప్పారు.
‘రాజు వెడ్స్ రాంబాయి’ ఆ సినిమా స్క్రిప్ట్ నిర్మాతల మనసును కలచివేసిందట. రకరకాల పరువు హత్యల గురించి విన్నాం కానీ ఈ సినిమాలోని హత్య గురించి విన్నాక ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలేదు అనిపించిందని చెప్పారు. అలా అని ఈ సినిమాలో విషాదకరమైన ముగింపు ఉండదని, ప్రేక్షకులు మంచి అనుభూతితోనే థియేటర్ల నుండి బయటకొస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఎండింగ్‌తో కల్ట్ సినిమాల సరసన ఎలా అనేది చూడాలి.
ఇక ఈ సినిమాలో ఎక్కడా ఈ ఘటన జరిగిన ఊరు పేరు, బాధితుల పేర్లను చెప్పడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఆ ఘటన జరిగిన ప్రాంతంలోనే సినిమాను చిత్రీకరించారట. కొన్ని చిన్న పాత్రల కోసం ఆ గ్రామంలోని వాళ్లనే తీసుకున్నారట. ఈ లెక్కన ఆ ఊరేంటో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. చూద్దాం మరి సినిమా వచ్చాక విషయం తెలుస్తుంది.