తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రీయాశీలకంగా ఉండే కొన్ని ప్రాజెక్ట్స్ అనూహ్యంగా నిలిచిపోవడం ఏమీ కొత్త కాదు. అలాంటి వాటిలో ఒకటిగా కనిపిస్తున్న ప్రాజెక్ట్ ఒక టాలెంటెడ్ యాక్టర్‌తో ప్లాన్ చేసింది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించాలనుకున్న విశ్వక్ సేన్ (Vishwak Sen) న్యూ సినిమా ఇప్పుడు అనూహ్యంగా నిలిచిపోయినట్లు సమాచారం. బంధుక్ అనే టైటిల్ కూడా లాక్ చేసుకున్నారు. ఇక కథకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న సమయంలో సినిమా మొదలు పెట్టడం కష్టంగా మారిందట.
ఈ ప్రాజెక్ట్‌కి కొత్త దర్శకుడిని తీసుకొచ్చినా, అతనిపై ఉన్న అనుమానాల కారణంగా సినిమా షూటింగ్ ఫైనల్ డేట్స్ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఒకవైపు హీరో విశ్వక్ తన షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడానికి ప్రయత్నించినా, పలు కారణాల వల్ల ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం నిర్మాతకు నిరాశ కలిగించిందని సినీ వర్గాల సమాచారం. ప్రాజెక్ట్‌లో ఆలస్యం కావడం వల్ల నిర్మాత ఇప్పుడు ఈ సినిమా కోసం కొత్త హీరోను వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
మంచి కథ ఉండి కూడా ఇది ముందుకు సాగకపోవడం ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను తగ్గించినట్లుగా కనిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితులు సాధారణమే అయినా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కారణాలు ఇంకా బయటపడలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా, హీరో విశ్వక్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతున్న ఒక లైలా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది.
అలాగే, మరో పెద్ద బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోవడం విశ్వక్ కు (Vishwak Sen) పెద్దగా నష్టంగా మారదని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇకపై ఈ ప్రాజెక్ట్‌ను కొత్త హీరోతో ప్రారంభించాలని భావిస్తున్నారు. స్క్రిప్ట్‌కు తగ్గట్టుగా సరైన నటుడు దొరికితే, ఇది మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందేమో చూడాలి.